ఘనంగా కన్యా వివాహ యోజన కల్యాణాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా కన్యా వివాహ యోజన కల్యాణాలు

Mar 13 2026 7:48 AM | Updated on Mar 13 2026 7:48 AM

భువనేశ్వర్‌: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సామాజిక మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద గురు వారం కటక్‌, సుందర్‌గఢ్‌లలో జిల్లా స్థాయి సామూహిక వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. కటక్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా పాల్గొన్నారు. నవ దంపతులకు ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కేవలం ఆర్థిక సహాయ పథకం మాత్రమే కాదు, బాల్య వివాహం, వరకట్న నిర్మూలనకు బలమైన సామాజిక చొరవ అని రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి ప్రభాతి పరిడా తెలిపారు. జీవితంలో కొత్త దశను ప్రారంభించే యువతులకు ఈ పథకం గౌరవం, భద్రత, సామాజిక గుర్తింపును నిర్ధారిస్తుంది. ఈ పథకం వితంతు పునర్వివాహాలను కూడా ప్రోత్సహిస్తుందన్నారు. కటక్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు చెందిన 55 జంటలు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖుల సమక్షంలో వివాహం ఘనంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి నూతన వధూవరులతో వ్యక్తిగతంగా సంభాషించి వారికి తన ఆశీస్సులు అందించారు. పరస్పర గౌరవం, అవగాహన మరియు సమానత్వం ఆధారంగా కుటుంబాన్ని నిర్మించుకోవాలని వారికి సూచించారు. కార్యక్రమానికి కటక్‌ సదర్‌ ఎమ్మెల్యే ఇంజనీర్‌ ప్రకాష్‌ చంద్ర సెఠి, మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ కమిషనర్‌, కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ మృణాళిని దరస్వాల్‌, ఆ శాఖ డైరెక్టర్‌ మోనిషా బెనర్జీ, ఇతర అధికారులు, కటక్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ దత్తాత్రేయ భౌసాహెబ్‌ షిండే, కటక్‌ నగర పాలక సంస్థ కమిషనర్‌ కిరణ్‌ దీప్‌ కౌర్‌ హాజరయ్యారు. ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద సుందర్‌గఢ్‌ జిల్లా శంకర్‌లోని కళ్యాణ్‌ మండప్‌లో జిల్లా స్థాయి సామూహిక వివాహ వేడుకను ఆనందోత్సాహాలతో నిర్వహించారు. సుందర్‌గఢ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 61 జంటలు సంప్రదాయ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. కార్యక్రమంలో సుందర్‌గఢ్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శుభంకర్‌ మహా పాత్రో, సుందర్‌గఢ్‌ మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ తాన్య మిశ్రా, డిప్యూటీ జిల్లా కలెక్టర్‌ తేజస్విని బెహెరా, అదనపు జిల్లా కలెక్టర్‌ (జనరల్‌) సూరజ్‌ కుమార్‌ పట్నాయక్‌, అదనపు జిల్లా కలెక్టర్‌ (రెవెన్యూ) అభిమన్యు మాఝి మరియు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి సుచితా పండా తదితర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన పథకం కింద 18 ఏళ్లు పైబడిన అర్హత కలిగిన బాలికల వివాహానికి రూ. 60,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇందులో రూ. 45,000 నేరుగా బాలిక బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతోంది. మిగిలిన రూ. 15,000 వివాహ వేడుకను నిర్వహణ నిమిత్తం ఖర్చుల కింద జారీ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement