భువనేశ్వర్: దేశంలో తాండవిస్తున్న వంట గ్యాసు కొరతతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గిడ్డంగులు ఇతరేతర కేంద్రాల్లో వంట గ్యాసు బండల అక్రమ నిల్వ నివారణ వైపు వినియోగదారుల సంక్షేమ శాఖ దృష్టి సారించింది. పౌర సరఫరా అధికార బృందాలు వివిధ ఎల్‌పీజీ గిడ్డంగులు తనిఖీ చేస్తున్నాయి. కటక్ జిల్లాలో ఈ దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. కటక్ జిల్లా అఠొగొడొ రాజ్‌నగర్ ప్రాంతంలోని యుబరాజ్ ఢాబా హోటల్ నుంచి 20 అక్రమ ఎల్‌పీజీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. 20 సిలిండర్లలో 10 నిండి ఉన్నాయి, 2 సగం నిండి ఉన్నాయి మిగిలిన 8 సిలిండర్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సిలిండర్లు అన్నింటిని అఠొగొడొలోని పద్మ గ్యాస్ ఏజెన్సీలో తాత్కాలికంగా భద్రపరిచారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.


