జయపురం: జయపురం సమితి గగణాపూర్‌లో మూతపడి ఉన్న సేవా పేపరు మిల్లును వెంటనే పునరుద్ధరించాలని మిల్లు కార్మిక నేతలు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతితో కలిసి సీఎం మోహన్‌చరణ్ మాఝిని గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. మిల్లు చాలాకాలంగా మూతపడి ఉండడంతో వేలాది కుటుంబాలు దుర్భరంగా బతుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని వెంటనే పేపరు మిల్లు పునరుద్ధరించాలని విన్నవించారు. దీంతో మిల్లును తిరిగి నడిపించేందుకు తగు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
బరంపురం మున్సిపల్
కమిషనర్‌గా శొశ్యారెడ్డి
జయపురం: జయపురం సబ్ కలెక్టర్, మున్సిపల్ కార్య నిర్వాహక అధికారి అక్కవరం శొశ్యారెడ్డి బరంపురం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్టుమెంట్ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఆమె కేవలం కమిషనర్‌గానే కాకుండా, బరంపురం డవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్‌పర్సన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విద్యార్థులకు వక్తృత్వ పోటీలు
రాయగడ: స్థానిక సాంస్కృతిక భవనంలో సమాచార హక్కుచట్టం(ఆర్‌టీఐ)పై విద్యార్థులకు జిల్లా యంత్రాంగం వక్తృత్వ పోటీలను గురువారం నిర్వహించింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆసక్తిగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. సమాచార హక్కుచట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, ఏడీపీఆర్‌వో టక్రీ, జర్నలిస్టు ప్రశాంత్ పాలో తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి చేరిన బీజేపీ కేంద్ర పరిశీలకుడు
భువనేశ్వర్: రాష్ట్రంలో జరగనున్న రాజ్య సభ ఎన్నికలకు చంద్రశేఖర్ బవాంకుల్ భారతీయ జనతా పార్టీ కేంద్ర పరిశీలకుడు, ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం భువనేశ్వర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర బీజేపీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు.
అగ్ని ప్రమాదంలో మార్కెట్ సముదాయం దగ్ధం
భువనేశ్వర్: స్థానిక కళింగ స్టూడియో కూడలి సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో బుధవారం అర్ధ రాత్రి ఒక దుకాణంలో రగిలిన మంటలు పరిసరాల్లో ఉన్న దుకాణాలకు తాకాయి. దీంతో తరణి మార్కెట్ సముదాయంలో అనేక దుకాణాలు దగ్ధమయ్యాయి. స్థానిక భరత్‌పూర్, టొమాండో అగ్ని మాపక బృందాలు మంటలను నివారించాయి. అగ్ని ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు వర్గాలు ఆరా తీస్తున్నాయి.


