రాజ్యసభ ఎన్నికలకు బీజేడీ విప్‌ జారీ | - | Sakshi
Sakshi News home page

రాజ్యసభ ఎన్నికలకు బీజేడీ విప్‌ జారీ

Mar 13 2026 7:48 AM | Updated on Mar 13 2026 7:48 AM

భువనేశ్వర్‌: రాజ్య సభ ఎన్నికలకు బిజూ జనతా దళ్‌ విప్‌ జారీ చేసింది. దీని ప్రకారం ఈ నెల 16 వరకు భువనేశ్వర్‌ విడిచి వెళ్లకూడదని దళం ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 13 నుంచి 16 వరకు బీజేడీ ఎమ్మెల్యేలు భువనేశ్వర్‌ విడిచి వెళ్లకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకురాలు చీఫ్‌ విప్‌ ప్రమీలా మాలిక్‌ ఈ విప్‌ జారీ చేశారు.

క్రమశిక్షణకు లోబడి ఉంటాను: సుభాషిణి జెనా

రాష్ట్రంలో రాజ్య సభ ఎన్నికల పోలింగు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ బిగుసుకుంటుంది. ప్రధానంగా 4వ స్థానం చేజిక్కించుకునే దిశలో ఎమ్మెల్యేల్ని కబ్జా చేసుకునే ప్రయత్నంలో అధికార భారతీయ జనతా పార్టీ రెప్ప వాల్చకుండా సానుకూలత కోసం నిరీక్షిస్తుంది. ఈ ఉచ్చులో పార్టీ ఎమ్మెల్యేలు చిక్కుకోకుండా విపక్ష బిజూ జనతా దళ్‌ మరియు కాంగ్రెసు అధినేతలు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. 4వ స్థానం చేజిక్కించుకునేందుకు అధికార భారతీయ జనతా పార్టీ దగ్గర ఏమాత్రం బలం లేదు. అయినా చివరి క్షణంలో విజయం తమకే వరిస్తుందనే గాలి కబుర్లు ప్రసారం చేసి రాజకీయ శిబిరాల్లో చిచ్చు రేపుతుంది. బీజేపీ 4వ స్థానం పోటీ కోసం దిలీప్‌ రేని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపింది. మరో వైపు విపక్షాలు బిజూ జనతా దళ్‌, కాంగ్రెస్‌ డాక్టరు దత్తేశ్వర్‌ హత్తాని ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దింపాయి. ఈ రెండు పార్టీల ఉమ్మడి ఓటింగుతో 4వ స్థానం విపక్షాల ఖాతాకు చేరడం తథ్యమని వాస్తవ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష శిబిరం నుంచి ఎమ్మెల్యేల్ని దారి మల్లించి 4వ స్థానం కై వసం చేసుకునేందుకు అధికార భారతీయ జనతా పార్టీ రాత్రింబవళ్లు కసరత్తు చేస్తుంది. విపక్షాల గూటి నుంచి పలువురు మాజీల్ని తమ గూటిలో చేరేందుకు పావులు కదుపుతు హడావిడి చేస్తోంది. విపక్ష బిజూ జనతా దళ్‌ మాజీ రాజ్య సభ సభ్యుడు రవీంద్ర జెనా పార్టీ ఫిరాయించి భారతీయ జనతా పార్టీలో బుధవారం చేరారు. ఈ చర్యతో అతడి భార్య, సిటింగు బీజేడీ ఎమ్మెల్యే సుభాషిణి జెనా ఓటు తటస్థతకు గురై విపక్షాల పునాది బీటలు వారేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో ఫలప్రదమైన చర్యగా భావించిన తరుణంలో..నవీన్‌ నా నాయకుడు,నేను బీజేడీతోనే ఉన్నానని సుభాషిణి జెనా గురు వారం స్పష్టం చేశారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ సూచనల ప్రకారం పనిచేస్తానని ఆమె అన్నారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నానని, పార్టీ ఏమి చెప్పినా తాను పాటిస్తానని ఆమె ఉద్ఘాటించారు.

మేం అంతా ఐక్యంగా ఉన్నాం: తారా ప్రసాద్‌ బాహినీపతి

మేము 14 మంది ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నాము. మా ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మైనస్‌ కావు. ఈ పరిస్థితిని సడలించేందుకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతుందని సీనియర్‌ కాంగ్రెసు నాయకుడు, సిటింగు ఎమ్మెల్యే తారా ప్రసాద్‌ బహినిపతి బాహాటంగా ఆరోపించారు.

విప్‌ జారీ సబబే

రాజ్య సభ ఎన్నికలు పురస్కరించుకుని విపక్ష బిజూ జనతా దళ్‌ విప్‌ జారీ చేయడం సబబేనని కాంగ్రెస్‌ శాసన సభ నాయకుడు రామచంద్ర కదమ్‌ మద్దతు పలికారు. రాజ్య సభలో నాల్గో సీటు సాధించే సంఖ్యా బలం అధికార పక్షానికి లేదు. అందువల్ల తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు కాపు కాసి ఉందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు రాజ్య సభ ఎన్నికల సందర్భంగా విప్‌ జారీ చేయడం జరిగిందన్నారు.

సుభాషిణి జెనా

రామచంద్ర కదమ్‌

తారా ప్రసాద్‌ బాహినీపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement