గంజాయి రవాణా గుట్టురట్టు
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సుమారు మూడు కేజీల గంజాయితో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మంగళవారం సాయంత్రం ఒడిశా నుంచి ఇద్దరు వ్యక్తులు లగేజీ బ్యాగ్‌లో సుమారు 3 కేజీల గంజాయితో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కడానికి వచ్చారు. ఆ సమయంలో బస్సు సిబ్బంది ప్రయాణికుల లగేజీలను తనిఖీలు చేస్తుండగా గంజాయిని గుర్తించి వ్యక్తిని పట్టుకున్నారు. మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే నిందితుడిని ట్రావెల్స్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి తమిళనాడుకు చెందిన వ్యక్తిగా ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెళియాపుట్టి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన జోడూరు గ్రామానికి చెందిన తిప్పాన భార్గవ్(20) రెండురోజులుగా మృత్యువుతో పోరాడి మృతిచెందాడు. శివరాత్రి నాడు పట్టుపురం ఆలయానికి ప్రసాద సామగ్రి తీసుకెళ్తూ ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో భార్గవ్ గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108 ద్వారా టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి శ్రీకాకుళం కిమ్స్‌కు తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో సోమవారం రాత్రి మృతిచెందాడు. ఐటీఐ చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడని, ఇంతలోనే తమకు దూరమయ్యాడని తల్లిదండ్రులు సీతామహాలక్ష్మి, రాము కన్నీరుమున్నీరుగా విలపించారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
ఎచ్చెర్ల : తోటపాలెం వద్ద మంగళవారం జరిగిన విద్యుత్ సంబంధిత ప్రమాదంలో అలికాం గ్రామానికి చెందిన రంధి రమణమూర్తి (48) అనే వ్యక్తి మృతి చెందాడు. కొన్నాళ్లుగా తోటపాలెం ప్రాంతంలో విద్యుత్ లైన్ పనులు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పనులు నిర్వహిస్తుండగా రమణమూర్తి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్సాహంగా జిల్లాస్థాయి చెస్ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి చెస్ ఎంపిక పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్‌కాలనీలో ఉన్న డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియం వేదికగా మంగళవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్–13, అండర్– 15, అండర్–19 వయో విభాగాల్లో బాలబాలికలకు చెస్ ఎంపిక పోటీలు జరిగాయి. శాప్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలతో ని ర్వహించిన ఈ ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 100మంది బాలబాలికలు హాజరై తమ ప్రతిభను నిరూపించుకున్నారు.
రాష్ట్రపోటీలకు ఎంపికై ంది వీరే..
అండర్–13లో బాలుర విభాగంలో బలివాడ జయంత్, బస్వ భానుతేజ్, బాలికల విభాగంలో బొల్లా శృతి, వైశ్యరాజు రోషిణి ప్రతిభ కనబర్చారు. అలాగే అండర్–15లో బాలుర విభాగంలో బొల్లా యశ్వంత్, బగాది కార్తికేయ, బాలికల విభాగంలో మెట్ట ప్రణీత, వడవలస లోచన ప్రతిభ కనబర్చారు. ఇక అండర్–19లో బాలి కల విభాగంలో రుప్ప మహాలక్ష్మి, కూన ప్రమీల ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 21నుంచి తిరుపతి వేదికగా జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్‌బాబు పేర్కొన్నారు.
కేంద్రీయ విద్యాలయం
స్థల పరిశీలన
పలాస: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయం స్థల పరిశీలన జరిగిందని, అక్కడ శాశ్వత భవనాలు తయారయ్యే వరకు తరగతులను పలాస రైల్వే స్టేషన్‌లోని పాత రైల్వే స్కూలు భవనాల్లో రానున్న విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి తగిన చర్య లు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చెప్పారు. పలాసలో మంగళవారం ఉదయం ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలసి పర్యటించారు. కాశీబుగ్గ సూదికొండ వద్ద సర్వేనెంబరు 51లో కేంద్రీయ విద్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. కాశీబుగ్గ ఆర్‌ఓబీని కూడా ఏ ప్రిల్‌లో ప్రారంభిస్తామని, బ్రిడ్జికి రెండు వైపుల సర్వీసు రోడ్లు వస్తున్నాయని చెప్పారు. అలాగే ఉద్దానం ప్రాంతంలో కార్గోఎయిర్‌పోర్టు నిర్మాణం కూడా జరుగుతుందని పేర్కొన్నారు.
గంజాయి రవాణా గుట్టురట్టు
గంజాయి రవాణా గుట్టురట్టు


