చక్రతీర్థ స్నానాలకు సిద్ధం
జలుమూరు: శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజు బుధవారం వంశధార నది లో జరగనున్న స్వామివారి చక్రతీర్థ స్నానాలకు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలు, నంది వాహనం అర్చకులు మంగళవారం సిద్ధం చేశారు. ప్రత్యేక పూలతో అలంకరించి నూతన వస్త్రాలు కట్టారు. అలాగే నంది వాహనం అలంకరించి చందనంతో కుంకుమ బొట్లు పెట్టారు. 12 గంటలు అనంతరం హారతులిచ్చి ఆలయం నుంచి కొబ్బరి కాయకొట్టి బయటకు తెస్తారు. స్వామివారిని నంది వాహనంపై ఆశీనులు చేసి ఆలయం నుంచి నది వరకూ తిరువీధిగా తీసుకువెళ్లి మిరియాపల్లి రేవులో పుణ్యక్రతువు నిర్వహిస్తారు.
పటిష్ట బందోబస్తు
స్వామివారి చక్రతీర్థ సాన్నాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం శ్రీముఖలింగంలో అన్ని శాఖల అఽధికారులతో సమీక్షించి మాట్లాడా రు. సుమారు 1000 మంది పోలీసులతో బందోబ స్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. నదిలోకి స్వామి ని తీసుకెళ్లే సమయంలో రోప్‌పార్టీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దీనికి ముందు ఆలయ పరిసరాలు, నది మార్గాలు, నదిలో బారికేడ్లు మిరియాపల్లి రేవును పరిశీలించారు. అలాగే రూట్ మ్యాప్, కంట్రోల్ రూమ్, పార్కింగ్ స్థలాలు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక సూచిక బోర్డులు ఏర్పాటు చేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కేవీ రమణ, పి.శ్రీనివాసరావు, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, డీఎస్పీలు వివేకానంద, షేక్ షాహబాజ్, అహ్మద్, లక్ష్మణరావు,గోవిందరావు తదితరులు ఉన్నారు.


