చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి
రణస్థలం: లావేరు మండలంలోని బుడుమూరు పంచాయతీ కూనపువానిపేట గ్రామానికి చెందిన మొండి సన్యాసి(71) శ్రీకాకుళం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లావేరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గ్రామ కోనేరులో స్నానానికి వెళ్లాడు. అకస్మాత్తుగా కాలుజారి చెరువులో పడిపోయాడు. స్థానికులు గుర్తించి ఇంటికి చేర్చారు. అప్పటికే నీరు ఎక్కువగా తాగడం వలన శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. కుమారుడు మొండి సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఎస్‌ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చత్తీస్‌గఢ్ సీఎంకు ఆహ్వానం
పలాస: భిలాయిలో ఈనెల 22వ తేదీన జరగనున్న వాడబలిజ తెలుగు మహా సమ్మేళనానికి చత్తీష్‌ఘడ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు రాయిపూర్‌లోని సీఎం ఇంటికి మహాసభ సన్నాహక కమిటీ సభ్యులు మంగళవారం వెళ్లి ఆహ్వానించారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ సీఎం వస్తానని మాటిచ్చారని స్టీరింగ్ కమిటీ చైర్మన్ మొరిపల్లి బాబూరావు తెలిపారు. సీఎంను ఆహ్వానించిన వారిలో బర్రి జోగారావు, డాక్టర్ లండ జగన్నాధరావు, కొండప్ప కూర్మారావు, బైపల్లి దేవదాసు, కంబాల పాపారావు, లోకేష్ కుమార్, వాసుపల్లి గణేష్, కూర్మారావు తదితరులు ఉన్నారు.
ప్రత్యేక తరగతులకు
మినహాయింపు ఇవ్వాలి
శ్రీకాకుళం: శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఫిబ్రవరి 15వ తేదీన ఉపాధ్యాయులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ నుంచి మినహాయింపు ఇవ్వాలని డీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పూజారి హరిప్రసన్న, ఎన్ని వెంకట ప్రసాద్‌లు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. పదో తరగతి 100 రోజుల ప్రణాళికలో భాగంగా శివరాత్రి రోజు ఆదివారం అయినప్పటికీ జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ప్రణాళికలో ఇవ్వడాన్ని డీటీఎఫ్ వ్యతిరేకిస్తోందన్నారు. అదేవిధంగా శివరాత్రి మరుసటి దినం స్థానిక సెలవు ప్రకటించుకునే ఆనవాయితీ ఉంది కాబట్టి, అదేరోజు జరుగనున్న జీవశాస్త్రం ప్రీ ఫైనల్ పరీక్షను వాయిదా వేయాలని కోరారు. ఆ పరీక్షను మరుసటి రోజు నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
15న సిక్కోలు సాహితీ
సంబరం
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళా మందిర్‌లో శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన సిక్కోలు సాహితీ సంబరాలు నిర్వహించనున్నట్లు కళా వేదిక ఉత్తరాంధ్ర అధ్యక్షుడు డబ్బీరు గోవిందరావు, కన్వీనర్ భోగెల ఉమామహేశ్వరరావు తెలిపారు. నగరంలో గాంధీ పార్కులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిక్కోలు సాహితీ సంబరానికి హాజరయ్యే కవులకు సాహితీ శిరోమణి బిరుదును ఇవ్వనున్నట్లు తెలిపారు. సామాజిక స్థితిగతులపై 20 వరుసలకు మించని కవితను బోర్డర్ గీసిన ఏ–4 తెల్ల కాగితంపై డీటీపీ లేదా చక్కగా రాసిన ఒక కాపీని రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించాలన్నారు. అలాగే 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకు రావాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రకారం కవులకు కవితా పఠనం, సత్కారంనకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. కవులు నేరుగా కవితా శీర్షిక చదివి, అనంతరం కవిత చదవాలి. పుస్తకావిష్కరణ కార్యక్రమాలు ఉండే కవులు వాటిని కవితాపఠనం తర్వాత చేయాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, శ్రీశ్రీ రాష్ట్ర కార్యదర్శి ముట్నూరు ఉపేంద్ర శర్మ, ఉపాధ్యక్షుడు ఇద్ది పాపయ్య, కార్యదర్శులు వాడాడ శ్రీనివాస్, చాడ శ్రీనివాస్, ఐఎన్‌డీ ప్రసాద్, కిల్లాన శ్రీనివాస్, తాళ్లూరి విజయ లక్ష్మణ్ పాల్గొన్నారు.
చోరీ కేసులో ముగ్గురికి రిమాండ్
హిరమండలం: హిరమండలం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుల్లెట్ దొంగతనం కేసులో ముగ్గురు ముద్దాయిలను రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ హేమంత్ కల్యాణ్ మంగళవారం తెలిపారు. 2025 డిసెంబర్‌లో హిరమండలం గిరిజాల వీధిలో జరిగిన బుల్లెట్ దొంగతనం కేసులో బుల్లెట్‌తో పాటు ముగ్గురు ముద్దాయిలను కొత్తూరు కోర్టు హాజరు పరచగా రిమాండ్ విధించారన్నారు. ముద్దాయిలను అంపోలు జిల్లా జైలుకు తరలించామని పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి


