మహిళా మావోయిస్టు లొంగుబాటు
కొరాపుట్: చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళా మావోయిస్టు కొరాపుట్ జిల్లాలో పోలీసులకు లొంగిపోయింది. గురువారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సదరన్ వెస్ట్రన్ రేంజ్ డీఐజి కన్వర్ విశాల్ సింగ్ ముందు మహిళా మావోయిస్టు మమతా పొడియామి లొంగి పోయారు. మావోయిస్టు పార్టీలో ఎసీఎం క్యాడర్‌లో మమతా కొనసాగుతున్నారు. తనతో పాటు ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్ తో పాటు 10 తూటాలు కూడా అప్పగించారు. మమతా ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అనేక విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నారు. ఈ ఘటనతో కొరాపుట్ జిల్లా మావోయిస్టు రహిత జిల్లాగా డీఐజీ ప్రకటించారు. ఆమెకి రాష్ట్ర ప్రభుత్వ మావోయిస్టు పునరావాస ప్రయోజనాలు అందుతాయన్నారు. ఆమైపె ఉన్న రు.5.50 లక్షల రివార్డు అందిస్తామన్నారు. అంతేకాక లొంగుబాటులో సమర్పించిన ఎల్‌ఎల్‌ఆర్ రైఫిల్ వల్ల మరో రు.1.75 లక్షలు, 36 నెలలు ఉపాధి శిక్షణ తో పాటు ప్రతి నెల రు.10 వేలు, గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం, ఇతర ప్రయోజనాలు అందిస్తామన్నారు. తక్షణ సాయం కింద రూ.50వేలు అందిస్తామని పేర్కొన్నారు. మమతా స్వస్థలం చత్తీస్‌గఢ్ రాష్ట్రం పామేడ్ జిల్లా లింగా పురం. ప్రస్తుత వయస్సు 24 ఏళ్లు అని డీఐజి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ వర్మ, పలువురు బీఎస్‌ఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
మహిళా మావోయిస్టు లొంగుబాటు


