ఇది బడా వ్యాపారులకు అనుకూల బడ్జెట్
● కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ నేతల ఆరోపణ
జయపురం: కేంద్ర ప్రభుత్వం 2026–27 బడ్జెట్ కేవలం బడావ్యారులకు లాభం కలిగించేదిగా ఉందని కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రూపక్ తురుక్ వ్యాఖ్యానించారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ భవనంలో కేంద్ర బడ్జెట్‌పై నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ పెద్ద, పెద్ద వ్యారులకు అనుకూలంగా, ఖనిజ సంపద దోచి పెట్టేందుకు వీలు కల్పించేందుకు సహకరిస్తుందని ఆరోపించారు. కొరాపుట్ జిల్లాలో పర్యాటకరంగా అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ.. ఒక్క ప్రదేశాన్ని బడ్జెట్‌లో చేర్చలేదన్నారు. మల్కన్‌గిరి, నవరంగపూర్ జిల్లాల రైల్వే లైన్ల అనుసంధానం కల్పించేందుకు బడ్జెట్‌లో ఎటువంటి నిధులు కేటాయించలేదన్నారు. ఈ బడ్జెట్ మధ్య తరగతి కుటుంబాలపై కొరడా అని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్, పెట్రోల్, తదితర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మునిసిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి మాట్లాడుతూ.. అమెరికా విధించిన టారిఫ్‌ల నేపథ్యంలో స్వదేశీ వస్తువుల వినియోగంపై ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపునకు భిన్నంగా బడ్జెట్ ఉందన్నారు. స్వదేశీ వస్తువుల ప్రోత్సాహంపై ఎటుంటి ప్రస్తావన లేదన్నారు. మల్కన్‌గిరి మాజీ ఎమ్మెల్యే నిమయి చరణ్ సర్కార్, జయపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత నాయక్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్య పట్నాయక్, రామ నాయక్, ప్రణబ్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పారటీ కోశాధికారి నిహారంజన్ బిశాయి, తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్ రూపకల్పనపై చర్చ
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూగర్గ్ అధ్యక్షత వహించిన అంతర్ విభాగ కార్యదర్శి స్థాయి సమావేశం ఖారవేల భవన్‌లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనపై లోతుగా చర్చించారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పథకాలు, కార్యక్రమాలను ఆవిష్కరించాలని అనూ గర్గ్ కార్యదర్శులకు సూచించారు. ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి, అంతర్ విభాగ సమస్యలను పరిష్కరించడానికి క్షేత్ర సందర్శనల ప్రాధాన్యతను ఆమె వివరించారు. బడ్జెట్ వ్యయం, ఆదాయ సేకరణ, ప్రాజెక్టు అమలుపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా గత ఏడాది జనవరి 31 నాటికి ఖర్చు, ఆదాయ సేకరణ స్థితిని కార్యదర్శులు సమీక్షించారు. వ్యవసాయం, మత్స్య సంపద, సామాజిక సేవల వంటి రంగాలలో గణనీయమైన పురోగతిని గుర్తించారు. పరిశ్రమలు, క్రీడలు, సైన్స్, టెక్నాలజీ, పర్యాటకం వంటి ముఖ్యమైన రంగాలపై దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. నిర్మాణాలు వేగవంతం చేసి ఆదాయ లక్ష్యాలను చేరుకోవాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. సమావేశంలో అభివృద్ధి కమిషనర్, అదనపు ప్రధాన కార్యదర్శి దేవ రంజన్ కుమార్ సింగ్, సాధారణ పాలన, ప్రజా ఫిర్యాదుల విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి సురేంద్రకుమార్, వివిధ శాఖల అదనపు ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శులు, అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు, కమిషనర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
విద్యార్థిపై దాడి
రాయగడ: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో చదువుతున్న విద్యార్థిపై మరో విద్యార్థి ఇనుప రాడ్డుతో దాడి చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తీవ్రగాయాలకు గురైన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై గాయాలపాలైన విద్యార్థి పినతండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐటీఐలో వెల్డర్ గ్రేడ్‌లో విద్యాభ్యాసం చేస్తున్న మనోజ్ గౌడొ అనే విద్యార్థిపై అదే క్యాంపస్‌లో చదువుతున్న భువన్ లిమ్మ అనే మరో విద్యార్థి వెనుక నుంచి ఇనుప రాడ్డుతో దాడి చేసి తలపై గాయపరిచాడు. క్లాస్ ముగిసిన తరువాత తరగతి గది నుంచి తిరిగి వస్తుండగా దాడి చేశాడు. ఈ దాడిలో మనోజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పాత కక్షల కారణంగానే ఇద్దరి మధ్య గొడవలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ తెలియజేశారు. ప్రస్తుతం మనోజ్ పరిస్థి ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు.
ఇది బడా వ్యాపారులకు అనుకూల బడ్జెట్
ఇది బడా వ్యాపారులకు అనుకూల బడ్జెట్


