ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
● రైతులకు ద్రోహం చేస్తున్న బీజేపీ సర్కారు
● కలెక్టరేట్ వద్ద బీజేడీ శ్రేణుల ధర్నా
పర్లాకిమిడి: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర బీజేపీ సర్కారు తీరుపై నిరసిస్తూ బుధవారం బీజేడీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ నాయక్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. తొలుత పర్లాకిమిడి పురపాలక సంఘం కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం మండీల వద్ద క్వింటాకు ఐదు కిలోల చొప్పున్న కట్నీ, చట్నీ కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. గజపతి జిల్లా ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారని, ఈ ఏడాది 73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే ప్రభుత్వం కేవలం 30.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. అందులోనూ కోతలు విధించడం భావ్యం కాదన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో బీజేడీ ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత పోరిచ్చా, కాశీనగర్ బ్లాక్ చైర్మన్ బల్ల శాయమ్మ, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు, మోహనా జెడ్పీటీసీ సునీల్ కుమార్ బిశోయి, గుమ్మా సమితి అధ్యక్షురాలు సునేమీ మండళ్, మధు (కాశీనగర్), బీజేడీ యువజన నాయకులు లెంక, బీజేడీ మాజీ అధ్యక్షుడు జగబంధు దాస్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం


