అగ్నిప్రమాదాల నియంత్రణకు.. విస్తృత సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదాల నియంత్రణకు.. విస్తృత సన్నాహాలు

Feb 5 2026 7:18 AM | Updated on Feb 5 2026 7:18 AM

అగ్నిప్రమాదాల నియంత్రణకు.. విస్తృత సన్నాహాలు

అగ్నిప్రమాదాల నియంత్రణకు.. విస్తృత సన్నాహాలు

భువనేశ్వర్‌: వేసవిలో అటవీ ప్రాంతంలో సహజంగా రగిలే అగ్ని మంటల నివారణ పట్ల అటవీ విభాగం ముందస్తుగా సమాయత్తం అవుతోందని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, చీఫ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌ డాక్టర్‌ కె.మురుగేషన్‌ తెలిపారు. రాష్ట్రంలో రానున్న అటవీ అగ్ని సీజన్‌ను విజయవంతంగా ఎదుర్కొవడానికి అటవీ శాఖ సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయన్నారు. స్థానిక అరణ్య భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అటవీ అగ్ని ప్రమాదాల ప్రభావం ఎదుర్కొనేందుకు సాంకేతిక, క్షేత్రస్థాయి చర్యలను వివరించారు. మంటలు అడవులకు మాత్రమే కాకుండా వన్యప్రాణులు, అడవులపై ఆధారపడిన ప్రజల జీవనోపాధికి పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయన్నారు. గత సంవత్సరం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 29,709 అటవీ అగ్ని ప్రమాదాలను గుర్తించామన్నారు. ఈ సంఘటనలు పొడి వాతావరణం, అడవిలో పేరుకుపోయిన ఎండుటాకులు, మానవ నిర్లక్ష్యం కారణంగా సంభవించినట్లు ధృవీకరించారు. వీటిని ఉపగ్రహ ఆధారిత హెచ్చరికలు, అటవీ అధికారుల సత్వర చర్యలతో దాదాపు 99.7 శాతం సంఘటనలు నియంత్రించబడినట్లు పేర్కొన్నారు. ఈ చర్యలతో నష్టం గణనీయంగా తగ్గించడం సాధ్యమైందన్నారు. ఈ ఫలితాల ఆధారంగా ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అడవిలో మంటలు వ్యాపించకుండా నిరోధించడానికి దాదాపు 20,461 కిలో మీటర్ల సుదీర్ఘ అగ్ని మాపక హద్దులను (ఫైర్‌ లైన్‌) రూపొందించామన్నారు.

సాంకేతిక నైపుణ్యతతో అడవి మంటల నివారణ..

ఈ సంవత్సరం అడవి మంటలను ఎదుర్కొవడానికి సాంకేతిక నైపుణ్యాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రారంభ దశలో మంటలను గుర్తించడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత కెమెరాలు, డ్రోన్లను ఉపయోగిస్తామన్నారు. దీనితో పాటు వివిధ శ్రేణులు, బీట్‌ స్థాయిలలో 334 ప్రత్యేక రక్షణ బృందాలను మోహరించి నిఘా పటిష్టపరుస్తామన్నారు. వీరికి 5,000 పైబడి లీఫ్‌ బ్లోయర్లు మరియు ఇతర అగ్నిమాపక పరికరాలు అందజేస్తామన్నారు. సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడానికి 631 పైబడి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 200 మంది జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సిబ్బందికి అడవి మంటల నివారణలో ప్రత్యేక శిక్షణ కల్పించామన్నారు. మరోవైపు అటవీశాఖ స్థానిక సమాజం, అటవీ ప్రాంతాలలో నివసించే ప్రజల సహకారం కోసం విజ్ఞప్తి చేసింది. అటవీ సంరక్షణ కమిటీలు మరియు పర్యావరణ అభివృద్ధి కమిటీల ద్వారా దాదాపు 336 గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. సాధారణ ప్రజల చురుకై న భాగస్వామ్యం లేకుండా ఈ సహజ వనరును రక్షించడం సాధ్యం కాదు. నిర్లక్ష్యంగా అడవికి నిప్పు పెట్టవద్దని అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement