తల్లి మందలించిందని..
● ఆత్మహత్య చేసుకున్న యువకుడు
పాతపట్నం: తల్లి పని చేసుకోమని మందలించిందని మండలంలోని దశరథపురం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు అమిత్ బౌరీ (17) మనస్తాపం చెందిన ఇంటి పెరటి వంటరేకుల షెడ్‌లో ఉరి వేసుకున్నాడని ఎస్‌ఐ కె.మధుసూధనరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దశరథపురం ఎస్సీ కాలనీకి చెందిన ఉమా బౌరీ, సుమిత్రబౌరీల కుమార్తె రిచాబౌరీ, కుమారుడు అమిత్ బౌరీలు. కుమారుడు అమిత్ బౌరీ ఇంటర్ వరకు చదు వుకున్నాడు. ఇంటర్‌లో రెండు సబ్జెక్ట్‌లు ఫెయిల్ కావడంతో గ్రామంలో తిరుగుతూ మైక్‌సెట్‌లు కట్టే పనికి వెళ్లేవాడు. ఇటీవల తల్లి సుమిత్ర బౌరీ కొడుకుకు వేరే ఏదైనా పనిచేసుకోవాలని చెప్పడంతో.. అతడు మనస్తాపంతో ఇంటికి సక్రమంగా రాకుండా, భోజనం కూడా సరిగా తినకుండా గ్రామంలో తిరుగుతుండేవాడు. ఈ నెల 14వ తేదీ బుధవారం భోగిరోజు రాత్రి పది గంటల సమయంలో ఇంటి పెరట వంట రేకుషేడ్‌లో ఉరి వేసుకున్నాడు. తల్లి గమనించి నిశ్చేష్టురాలైపోయింది. వెంటనే భర్తకు, గ్రామస్తులకు తెలియజేశారు.
గురువారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మృతిపై తండ్రి ఉమాబౌరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


