ముగిసిన ఏసీఏ సంక్రాంతి వేడుకలు
భువనేశ్వర్: ఆంధ్ర సాంస్కృతిక సమితి (ఏసీఏ) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఆనందోత్సాహాలతో ముగిశాయి. పండగ సంప్రదాయంలో భాగంగా భోగీ మంట, బాలల భోగీ పండ్లు, ముత్తైదువుల పసుపు–కుంకుమ, రంగవల్లి తదితర ఆచార వ్యవహారాలతో జరుపుకున్న వేడుకల్లో ఆబాలగోపాలం పాలుపంచుకున్నారు. ఆటపాటలు, తమాషా పోటీలు, కట్టూబొట్టు వంటి మనోరంజక కార్యక్రమాలు హుషారుగా సాగాయి. మంగళ గిరి నుంచి విచ్చేసిన రోహిణి బృందం ప్రదర్శించిన గోదా కల్యాణం నృత్య నాటిక, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పీఎం మోహన్ రావు రచన, రాయప్రోలు సాయి లక్ష్మి దర్శకత్వంలో వేలం వెర్రి నాటకం కొసమెరుపుగా ఆకట్టుకుంది. భారతీయ స్టేట్ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ ఏడీ రత్న తేజ, గెయిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జి.హర గోపాల్ అతిథులుగా విచ్చేసి సంక్రాంతి వేడుకల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకుని ఏసీఏ సభ్యులను ప్రోత్సహించారు.


