రోడ్డు ప్రమాదంలో రేంజర్ మృతి
రాయగడ: రోడ్డు ప్రమాదంలో కల్యాణ సింగుపూర్ అటవీ శాఖ రేంజర్ చందన్ గొమాంగో(43) మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చందన్ గొమాంగో తన సొంత కారులో కల్యాణ సింగుపూర్ నుంచి రాయగడకు వస్తుండగా కొలనార సమితి శ్రీరామపూర్ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో కారు ముందరి భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో గొమాంగో తీవ్రగాయాలకు గురయ్యారు. స్థానికులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
జేకే పేపర్ మిల్‌కు సేప్టీ
ఎక్స్‌లెన్స్ అవార్డు
రాయగడ: సదరు సమితి జేకేపూర్‌లోని జేకే పేపర్ మిల్‌కు ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఎన్విరో సేఫ్టీ ఎక్స్‌లెన్స్ అవార్డు–26 ప్లాటినం కేటగిరీ అవార్డు దక్కించుకుంది. భద్రత రంగంలో అద్భుతమైన పనితీరును కనబరిచినందుకు ఈ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని గ్రీన్ ఎన్విరో ఫౌండేషన్ ఈ అవార్డును ప్రదానం చేసింది. గోవాలో గ్రీన్ ఎన్విరో ఫౌండేషన్ ద్వారా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ఈ మేరకు అవార్డును అందజేసింది. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఇందన శాఖ సహాయ మంత్రి ఎపాద యస్సొనాయక్ హాజరై జేకే పేపర్ మిల్ జనరల్ మేనేజర్ సత్యజీత్ మహంతికి అవార్డును అందజేశారు. కృషి, పట్టుదల, అంకిత భావం, నిబద్దతతో పనిచేస్తే అవార్డులు లభిస్తాయని మంత్రి నాయక్ పేర్కొన్నారు.
పట్టణ బీజేడీ పార్టీ అధ్యక్షుడిగా పార్థసారథి
రాయగడ: రాయగడ పట్టణ బీజేడీ పార్టీ అధ్యక్షుడిగా వి.వి.పి.పార్థసారథి నియమితులయ్యారు. రాష్ట్ర శాఖ సీనియర్ నాయకుడు, పార్టీ ఉపాధ్యక్షుడు దేవిప్రసాద్ మిశ్రా ఈ మేరకు జిల్లాలోని సమితి, నగర, అధ్యక్షుల జాబితాను ప్రకటించారు. అదే విధంగా రామనగుడ సమితి అధ్యక్షునిగా బత్రిమండంగి, గునుపూర్ సమితికి సొమేశ్వరరావు, గుణుపూర్ పట్టణానికి పూర్ణచంద్ర బౌరి, పద్మపూర్ సమితికి కరుణాకర్ సబర్, చంద్రపూర్ సమితికి మంగల్ బిబాక, గుడారి సమితికి బిశ్వనాథ్ సబర్, గుడారి ఎన్‌ఏసీకి ఈశ్వర చంద్ర పాణిగ్రహి, మునిగుడ సమితికి రతన్ లాల్‌మ జైన్, కొలనార సమితికి లక్ష్మణ్ పెద్దింటి, బిసంకటక్ సమితికి జయరాం హికక, కళ్యాణ సింగుపూర్ సమితికి సుందర్‌రావు బాగ్, రాయగడ సమితికి ప్రతాప్ పెద్దింటి, కాసీపూర్ సమితికి రతికాంత్ నాయక్‌లు నియమితులైనట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి, రానున్న పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తమదైన శైలిలో బీజేడీ ఎదుర్కొంటుందని అందుకు ఇప్పటి నుంచేరంగం సిద్ధం చేస్తున్నట్లు మిశ్రా తెలిపారు.
నేటి నుంచి చిలికా పక్షుల లెక్కింపు
భువనేశ్వర్: దేశంలోని అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు చిలికా వలస పక్షుల స్వర్గధామం. ఈ సరస్సులో పక్షులు మరియు డాల్ఫిన్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం అయింది. ఈనెల 18వ తేదీన పక్షుల లెక్కింపు, 20న డాల్ఫిన్ల గణన జరుగుతుందని చిలికా వైల్డ్‌లైఫ్ డివిజన్ డీఎఫ్‌వో అమలన్ నాయక్ తెలిపారు. సరస్సు వ్యాప్తంగా 22 గ్రూపులు పక్షుల లెక్కింపులో పాల్గొంటాయి. ఒక్కో గ్రూపులో ఒక పక్షి నిపుణుడు, 3 నుంచి 5 మంది గణనదారులు, 2 మంది బోట్ ఆపరేటర్లు ఉంటారు. సతొపొడ, రంభ, బలుగాంవ్, టంగి మరియు చిలికా ప్రాంతాల్లో లెక్కిస్తారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లెక్కింపు నిరవధికంగా కొనసాగుతుంది. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, రాష్ట్ర వన్య ప్రాణుల విభాగం, అటవీ విభాగం, ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వ విద్యాలయం విద్యార్థులు, స్థానిక పక్షుల పరిశీలన నిపుణులు లెక్కింపులో పాల్గొంటారు.
రోడ్డు ప్రమాదంలో రేంజర్ మృతి


