పోటెత్తిన భక్తజనం
ఆమదాలవలస: మండలంలోని గాజులకొల్లివలస సమీపంలో కొండపై కొలువై ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సంక్రాంతి, కనుమ–ముక్కనుమ పండుగల సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరలో రెండో రోజు శుక్రవారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. జాతర మొదటి రోజు పండుగ నాడు భక్తులు ఓ మోస్తరుగా హాజరైనప్పటికీ, రెండో రోజు అలికాం–బత్తిలి ప్రధాన రహదారి, పార్వతీశంపేట–పాలకొండ రహదారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. కొండపై ఉన్న సంగమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. గుడి ప్రాంగణం నుంచి మెట్ల వరకు భక్తులు క్యూలలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.


