ఇద్దరు బీజేడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సస్పెండ్
భువనేశ్వర్: ప్రతిపక్ష బిజూ జనతా దళ్ (బీజేడీ) గురువారం ఇద్దరు సిట్టింగ్ శాసనసభ సభ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వీరు ఇరువురు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణ. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలైనట్లు స్పష్టం చేశారు. బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ నిర్ణయం మేరకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలలో కేంద్రాపడా జిల్లా పటకురా నియోజకవర్గం ఎమ్మెల్యే అరవింద్ మహా పాత్రో, కెంజొహర్ జిల్లాలోని చంపువా నియోజకవర్గం ఎమ్మెల్యే సనాతన్ మహాకుడు ఉన్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అరవింద్ మహా పాత్రో రాష్ట్ర మాజీ మంత్రి బిజయ్ మహా పాత్రో కుమారుడు కాగా, సనాతన్ మహాకుడు చంపువా శాసన సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేడీ అధికార ప్రతినిధి, మీడియా సమన్వయకర్త లెనిన్ మహంతి మాట్లాడుతూ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ నాయకత్వంలో పార్టీ నిబంధనల ప్రకారం క్రమశిక్షణను అనుసరిస్తుంది. ఉల్లంఘనలపై నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎమ్మెల్యేలు అరవింద్ మహా పాత్రో, సనాతన్ మహాకుడు పార్టీ మార్గదర్శకాలను ఉల్లంఘించారు. పార్టీ నియమావళి ప్రకారం తక్షణమే సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేడీ కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారని లెనిన్ మహంతి అన్నారు.
ఇద్దరు బీజేడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సస్పెండ్


