రాయగడ: సదరు సమితి పితామహాల్‌లోని రాధాకాంత్ మందిరంలో ఆదివారం విశేష పూజలను నిర్వహించారు. మందిరం ప్రాంగణంలో సుమారు 70 వేల రూపాయలతో కొత్తగా నిర్మించే ఽఅరుణ స్తంభాన్ని ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేశారు. ప్రముఖ న్యాయవాది సుశాంత్ కుమార్ పండ, మధుస్మిత పండ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
దహన సంస్కారాలకు వెళ్లినవారిపై తేనె టీగల దాడి
● ఆరుగురికి గాయాలు
రాయగడ: శవాన్ని దహనం చేసేందుకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. గాయాలకు గురైన వారిని కళ్యాణసింగుర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వివరాల్లొకి వెళితే.. గ్రామంలో ఒకరు చనిపోవడంతో మృతదేహాన్ని దహన సంస్కారాలు చేసేందుకు సమీపంలోని కళ్యాణినదికి వెళ్లారు. బ్రిడ్జి కింద ఉన్న తేనేటీగలు ఒక్కసారిగా వారిపై దాడి చేయడంతో అంతా పరుగులు తీశారు. ఈ క్రమంలో శుకాంత్ పట్నాయక్, పుదీర్ పట్నాయక్, సుధాంశు పట్నాయక్, కలియా ముండోసేన, బ్రజకిశోర్ పట్నాయక్, రమేష్ కడ్రకలు గాయపడ్డారు.
రాష్ట్రపతి రెండు రోజుల
రాష్ట్ర పర్యటన
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటనకు రాష్ట్రానికి విచ్చేయనున్నారు. ఈ 27, 28 తేదీల్లో రాష్ట్రంలో రెండు రోజులు పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుతారు. అక్కడి నుంచి రాజ్ భవన్ చేరుకుని మధ్యాహ్నం 2.25 గంటలకు చేరి కళింగ అతిథి గృహాన్ని ప్రారంభిస్తారు. అక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రానికి చెందిన కొంతమంది మంత్రులు పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 4.20 గంటలకు శాసన సభకు చేరుకుంటారు. 17వ అసెంబ్లీ సమావేశం సందర్భంగా సాయంత్రం 4.30 గంటలకు రాష్ట్రపతి ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె రాత్రికి రాజ్ భవన్ కళింగ అతిథి గృహంలో బస చేస్తారు. మరుసటి రోజు 28వ తేదీన రాష్ట్రపతి ఉదయం 9.35 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళతారు.
గుప్తేశ్వర్ మార్గంలో
విరిగి పడిన వృక్షం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో ప్రసిద్ధ శైవ క్షేత్రం గుప్తేశ్వర్ మార్గంలో భారీ వృక్షం శనివారం విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు విరిగి పడటంతో పరిసర గ్రామాలలోని పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందిన గుప్తేశ్వర అటవీ విభాగ సిబ్బంది హుటాహుటీన చేరుకొని రోడ్డుకు అడ్డంగా పనిఉన్న చెట్టును యంత్రాలతో కోసివేసి మార్గం క్లియర్ చేశారు.
రాధాకాంత్ మందిరంలో విశేష పూజలు


