ఉప ఎన్నికల ఫలితాలు ప్రామాణికం కాదు
● కార్యకర్తలకు నవీన్ ఉపదేశం
● బీజేడీ పీఏసీ సమావేశం
భువనేశ్వర్: నువాపడా ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత నవీన్ నివాసంలో రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. బీజేడీ అధినేత దీనికి అధ్యక్షత వహించి పార్టీ నాయకులకు వెన్ను తట్టి ప్రోత్సహించారు. అపార రాజకీయ అనుభవంతో ఉప ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహపడవద్దని నాయకులకు ప్రోత్సహించారు. కొత్త వ్యూహంతో ఎలా ముందుకు సాగాలో వివరించారు.
ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు, సంస్థాగత బలోపేతం పట్ల దృష్టిని కేంద్రీకరించాలన్నారు. క్షేత్ర స్థాయి కార్యకర్తల క్రమశిక్షణ ప్రజా సంబంధాలకు బలమైన పునాదిగా పేర్కొన్నారు. పార్టీ లో క్రమశిక్షణను కాపాడి సంస్థను బలోపేతం చేసి బీజేపీ ప్రభుత్వ తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలకు అవగాహన పరచాలని సూచించారు. అట్టడుగు స్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంగా ప్రజలకు చేరువై పార్టీ కార్యవర్గం నైతికత ప్రదర్శించి విశ్వసనీయత కూడగట్టుకోవాలని ఉత్సాహపరిచారు.
2019 సంవత్సరం అక్టోబర్, 2023 సంవత్సరం మే మధ్య రాష్ట్రంలో వరుసగా 8 ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేడీ 7 గెలిచింది. 2019 అక్టోబర్‌లో జరిగిన బిజేపూర్‌లో ఉప ఎన్నికలో బీజేడీ అభ్యర్థి రీతా సాహు దాదాపు 98,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచింది. వెంబడి 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ ఈ స్థానాన్ని కోల్పోయింది. అదే విధంగా 2022లో బ్రజ్‌రాజ్‌నగర్‌లో జరిగిన ఉప ఎన్నికలో అల్కా మహంతి బీజేడీ నుంచి పోటీ చేసి 66,000 ఓట్ల ఆధిక్యతతో విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సురేష్ కుమార్ పూజారి ఈ స్థానం నుండి గెలిచారు. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఒక సంవత్సరం ముందు జరిగిన ఝార్సుగుడ ఉప ఎన్నిక బీజేడీకి అనుకూలించిన తదుపరి ఎన్నికల్లో ప్రతికూలించాయి. 2023 మే నెలలో దీపాలి దాస్ బీజేడీ అభ్యర్థిగా పోటీ చేసి 48,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచి ఝార్సుగుడలో విజయ కేతనం ఎగుర వేసిన గత సార్వత్రిక ఎన్నికల్లో (2024) బీజేడీ ఈ నియోజక వర్గంలో పరాజయం ప్రత్యక్షంగా చవి చూసింది. ఎన్నికల్లో ఒడిదుడుకులు దక్షతతో అధిగమించేందుకు ప్రజలతో సుదృఢ సత్సంబంధాలు, క్షేత్ర స్థాయి కార్యకర్తల నుంచి అగ్ర స్థాయి నాయకుల మధ్య పటిష్టమైన సమన్వయంతో బీజేడీ క్రమశిక్షణ నిబద్ధతతో ప్రజా సేవ దృక్పథంతో అనుక్షణం ప్రతిస్పందించడం భవిష్యతు విజయాలకు బలమైన బాటని ఆవిష్కరిస్తుందని నవీన్ పట్నాయక్ బీజేడీ నాయకులు, కార్యకర్తల్ని ఉద్దేశించి రాజకీయ వ్యవహారాల కమిటి (పీఏసీ) సమావేశంలో ప్రబోధించారు.


