
విపత్తులపై అప్రమత్తం
భువనేశ్వర్ : రాష్ట్రంలో పలుచోట్ల నదులు ఉప్పొంగి వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో విపత్తు నిర్వహణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ఆదేశించారు. రాజ్ భవన్ కాన్ఫరెన్సు హాలులో రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారితో సమావేశమై చర్చించారు.
వరద నీరు సద్వినియోగం కావాలి..
వరద నీటితో ఉప్పొంగుతున్న నదులు, ఇతరేతర జలాశయాల్లో నీటిని నీటి ఎద్దడి ప్రాంతాలకు మళ్లించి సాగునీరుగా బహుళార్ద ప్రయోజనాలకు సద్వినియోగం చేసుకోవాలని అనుబంధ యంత్రాంగానికి గవర్నర్ సూచించారు. అనుకూలమైన ప్రాంతాల్లో బ్యారేజీలను నిర్మించి, మిగులు నీటిని మెరుగైన వినియోగం కోసం మళ్లించాలన్నారు. వరద పరిస్థితులను నియంత్రించి జలాశయాల పునరుద్ధరణకు దోహదపడుతుందన్నారు.
అంతర్ రాష్ట్ర నదీ పరీవాహక అనుసంధానం దిశలో అడుగులు వేయాలన్నారు. వరదలు వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రముఖ కార్యదర్శి, ప్రత్యేక సహాయ కమిషనర్ దేవ్ రంజన్ సింగ్, అదనపు ప్రముఖ కమిషనర్ మనీష్ అగర్వాల్, ఇంజనీర్ ఇన్ చీఫ్, జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.