
సుధాకర్‌రెడ్డికి ఘన నివాళులు
జయపురం: భారతీయ కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ, కామ్రెడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష ఉద్యమానికి, పీడిత ప్రజలకు తీరని లోటని కమ్యూనిస్టు పార్టీ నేతలు అన్నారు. జయపురం కార్మిక కర్మచారి భవనంలో జిల్లా కమ్యూనిస్టు పార్టీ శనివారం సంతాప సభ నిర్వహించింది. పార్టీ జిల్లా కార్యదర్శి రామకృష్ణ దాస్ అధ్యక్షతన జరిగిన సంతాప సభలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడారు. సురవం 2012 నుంచి 2019 వరకు పార్లమెంట్ సభ్యునిగా, జాతీయ కమ్యూనిస్టు పార్టీ సాధారణ కార్యదర్శిగా దేశ ప్రజలకు, పార్టీకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంతాప సభలో కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి జుధిష్టర రౌళో, కార్మిక నేత బసంత బెహరా, భవన్ కుమార్, బొయిపరిగుడ జోనల్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బలభద్ర బోయి, తదితరులు పాల్గొన్నారు.