
32 వంతెనల నిర్మాణానికి ఆమోదం
భువనేశ్వర్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో ‘సేతు బంధన్‘ యోజన కింద రాష్ట్రంలో 12 జిల్లాల్లో 32 వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బొలంగీర్, సువర్ణపూర్, నయాగడ్, సంబల్‌పూర్, మల్కన్‌గిరి, కొరాపుట్, జగత్‌సింగ్‌పూర్, బర్‌గడ్, బౌధ్, భద్రక్, కటక్, పూరీ జిల్లాల్లో ప్రతిపాదిత వంతెనలు నిర్మిస్తారు.
అవయవదాత కుటుంబాలకు ఆర్థిక సాయం
పర్లాకిమిడి: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆశ్వాన్ హాలులో బుధవారం ప్రపంచ అవయవదాన దినోత్సవం నిర్వహించారు. చనిపోతూ పులువురికి అవయవదానం చేసిన ఐదుగురు వ్యక్తులకు సంబంధించి ఆయా కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సూరజ్ పురస్కారాలు 2025 పేరిట ఆర్థిక సహాయం అందజేశారు. సాయం అందుకున్న వారిలో పర్లాకిమిడి సేరివీధికి చెందిన నర్సింహ ప్రసాద్ మహారాణా, పాటికోట గ్రామానికి చెందిన పి.శోబోరో, తెలుగు సొండివీధికి చెందిన కె.నారాయణ పట్నాయిక్, రాయగడ బ్లాక్ సన్నతుండి గ్రామానికి చెందిన అరుణ్ భుయ్యాన్ ఉన్నారు. వీరి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ఏడీఎం ఫాల్గుణీ మాఝి అందజేశారు. కార్యక్రమంలో సి.డి.ఎం.ఒ. డాక్టర్ ఎం.ఎం.ఆలీ, అసిస్టెంట్ కలెక్టర్ జగన్నాథ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నీటిగుంతలో పడి యువకుడు మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి పూజారిగూఢ గ్రామంలో ఓ యువకుడు కాలుజారి నీటిగుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనుగౌడ్ అనే యువకుడు రోజులాగానే బుధవారం పనికి వెళ్లాడు. వాటర్ ట్యాంక్ సమీపంలోని నీటిగుంత వద్ద పని చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో జారిపడిపోయాడు. అక్కడ ఉన్నవారు మాజీ సర్పంచ్ రామ్‌చంద్రకు సమాచారం ఇచ్చారు. ఆయన సమితి అధ్యక్షుడు సధశివ పూజారికు సమాచారం ఇవ్వడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సోనును బయటకు తీసి మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారని పోలీసులు పేర్కొన్నారు. సోనుగౌడ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
’హర్‌ఘర్ తిరంగా’ ర్యాలీ
పర్లాకిమిడి: రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు స్థానిక మహిళా కళాశాల విద్యార్థినులు ’హర్‌ఘర్ తిరంగా’ ర్యాలీని డోలా ట్యాంక్ నుంచి ప్యాలస్ వీధుల మీదుగా బుధవారం నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళా కళాశాల అధ్యక్షురాలు డాక్టర్ రీనా సాహు, కళాశాల విద్యార్థిని సంఘం నాయకురాలు కల్పనా నాగవంశ, తదితరులు పాల్గొని వందేమాతరం నినాదాలు చేశారు.
ప్రైవేటు బస్సు బోల్తా
● ఎనిమిది మందికి గాయాలు
కశింకోట: అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నూతలగుంటపాలెం వద్ద బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఎస్‌ఐ పి.మనోజ్‌కుమార్ అందించిన వివరాలు.. ఒడిశా రాష్ట్రం అడ్డుబంగి నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు.. ముందు వెళుతున్న వాహనాన్ని తిప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి నూతలగుంటపాలెం రిలయన్స్ బంక్ వద్ద రోడ్డు పక్కనున్న పల్లపు ప్రాంతంలోకి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది గాయపడ్డారు. వారిని 108 వాహనంలో అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 37 మంది ప్రయాణిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీఐ అల్లు స్వామినాయుడు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిలో భరతన్, కృష్ణారావు, పార్వతి, ఉమా, మాధవి, సనాతన రాయ్, పి.శ్రీరాములు, రాములమ్మ, బృందావతి, కె.మోహన్‌రావు తదితరులు ఉన్నారు.

32 వంతెనల నిర్మాణానికి ఆమోదం

32 వంతెనల నిర్మాణానికి ఆమోదం

32 వంతెనల నిర్మాణానికి ఆమోదం