
ఎమ్మెల్యే ఎల్‌ఏడీ వెబ్ పోర్టల్ ప్రారంభం
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ బుధవారం లోక్ సేవా భవన్‌న్‌లో రాష్ట్ర మంత్రి మండలి సమక్షంలో ఎమ్మెల్యే స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎమ్మెల్యే–ఎల్‌ఏడీ), ముఖ్యమంత్రి ప్రత్యేక సహాయం (సీఎం–ఎస్‌ఏ) పథకాలకు సరళీకృత మార్గదర్శకాల సంచికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఎల్‌ఏడీ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ కొత్త మార్గదర్శకాలు సుపరిపాలన ప్రక్రియను సరళీకృతం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అత్యంత అవసరమైన, మౌలిక సదుపాయాలను త్వరగా, పారదర్శకంగా అమలు చేయడంలో ఈ సంస్కరణలు సహాయపడతాయన్నారు. కొత్త ‘ఎమ్మెల్యే ఎల్‌ఏడీ వెబ్ పోర్టల్’ ఆధ్వర్యంలో ప్రాజెక్టు సిఫార్సులు, ప్రాజెక్ట్ అవసరాల అంచనా, ప్రణాళిక , వ్యయ అంచనా తయారీ, ప్రాజెక్టుల ఆమోదం, పని ఆదేశాలు, పర్యవేక్షణ, తనిఖీ, వ్యయం, పని అమలు మొదలైన వాటిని ఎమ్మెల్యేలు సకాలంలో పూర్తి చేసేందుకు వీలవుతుందన్నారు. తాజా సరళీకరణతో ప్రాజెక్టు సిఫార్సు, వర్క్ ఆర్డర్‌ల జారీ మధ్య సమయాన్ని 30 రోజులకు పరిమితం చేశామన్నారు. ఇది వేగవంతమైన అమలును నిర్ధారిస్తుందన్నారు. శాసనసభ్యులు వెబ్ పోర్టల్ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల సిఫార్సు, ఆమోదాల పర్యవేక్షణ, అమలును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. జవాబుదారీతనాన్ని గుర్తించి నియోజకవర్గం బహుముఖ అభివృద్ధి ప్రతిపాదనల వాస్తవ కార్యాచరణలో జాప్యం నివారణకు ఈ పోర్టల్ దోహదపడుతుందన్నారు. 1997–98లో ప్రారంభమైన ఎమ్మెల్యే–ఎల్‌ఏడీ పథకం స్థానిక మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడానికి కీలకమైన సాధనంగా అభివృద్ధి చెందిందన్నార9ఉ. 2025–26లో నియోజకవర్గానికి వార్షిక కేటాయింపును రూ.5 కోట్లకు పెంచామన్నారు. ఇది స్థానిక ప్రతినిధులకు సాధికారత కల్పించడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను, పొరుగు రాష్ట్రాల ఉత్తమ పద్ధతుల సమాహారంతో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సరళీకృత మార్గదర్శకాలను రూపొందించామన్నారు. సంస్కరణ ప్రక్రియలో పాల్గొన్న అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంస్కరణ అభివృద్ధిని వేగవంతం చేయడంలో డిజిటల్ పాలన ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందన్నారు. పరిపాలనా ప్రక్రియలను క్రమబద్ధీకరించి జాప్యం నివారణతో నియోజకవర్గాలలో అభివృద్ధి ప్రాజెక్టులను సకాలంలో అమలు చేయడం ఈ కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్ పోర్టల్ యొక్క లక్ష్యాలు, కొత్త మార్గదర్శకాల యొక్క అవలోకనాన్ని సమర్పించారు.

ఎమ్మెల్యే ఎల్‌ఏడీ వెబ్ పోర్టల్ ప్రారంభం