
బ్యాంకు అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు
మల్కన్‌గిరి: రుణాలు చెల్లించినప్పటికీ తమను మోసం చేశారని మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితిలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 20 మంది మహిళలు ఆరోపించారు. కోరుకొండ సమితి కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో తమకు డబ్బులు ఆశ చూపి రుణం ఇప్పిస్తామని కొంతమంది మోసం చేశారని ఆరోపించారు. ఈక్రమంలో బుధవారం ముందుగా బ్యాంక్‌కు తాళం వేసి అనంతరం మహిళలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. 2024లో బ్యాంక్‌లో 20 మంది రూ. మూడు లక్షలు రుణం తీసుకున్నారు. బ్యాంక్ వారు ఇచ్చిన గడువులోగా తీసుకున్న రుణాన్ని చెల్లించారు. అయినా ఇంకా మీ గ్రూప్ సభ్యులు మూడు లక్షలు రుణం చెల్లించాల్సి ఉందని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఆందోళనతో బ్యాంకుకు చేరుకొని తాళాలువేసి కలెక్టర్ సోమేష్ ఉపాధ్యాయను కలిసి బ్యాంకు అధికారులపై ఫిర్యాదు చేశారు. బ్యాంక్ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.