
శ్రీమందిరంలో నాలుగు గంటలు దర్శనాలు నిలిపివేత
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరంలో బుధవారం మూల విరాట్టు దర్శనం తాత్కాలికంగా నిలిపి వేశారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నాలుగు గంటల సేపు సర్వ దర్శనం నిలిపి వేశారు. శ్రీ మందిరం రత్న వేదికపై శ్రీ జగన్నాథుని రాహు రేఖ సేవ పురస్కరించుకుని సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేయడం అనివార్యమైనట్లు ఆలయ అధికార వర్గాలు తెలిపాయి. ఏటా భాద్రపద మాసం కృష్ణ పక్ష రేఖా పంచమి నాడు రాహు రేఖను అలంకరిస్తారు. ఇది గోప్య సేవ కావడంతో బుధ వారం సాయంత్రం నాలుగు గంటల పాటు దర్శనం ఆపి వేశారు.ప్రథమ భోగ మండప సేవ తర్వాత రాహు రేఖ సన్నాహాలు ప్రారంభించారు. రాహు రేఖ శ్రీ జగన్నాథుని ముఖాన ధగేలుమనే అర్ధ వలయ ఆకార బంగారు ఆభరణం. స్నాన పూర్ణిమ పురస్కరించుకుని దీనిని తొలగించారు. తిరిగి భాద్రపద మాసం కృష్ణ పక్షం పంచమి నాడు ఈ అలంకరణ పునరుద్ధరించడం ఆచారం. గోపాల వల్లభ్ భోగం నివేదన తర్వాత తొఢౌ కొరొణొ, దెవులొ కొరొణొ సేవకులు భండార్ మేకాప్ సేవకులతో సంప్రదించి రత్న భాండాగారంలో పదిల పరిచిన బంగారు రాహు రేఖను బయటకు తీస్తారు. బెహెరెణొ ద్వారం దగ్గర ఆలయ కంసాలి సేవకులు రాహు రేఖను శుభ్రం చేసి అలంకరణకు సిద్ధం చేస్తారు. ప్రథమ భోగ మండప సేవ ముగియడంతో పాలియా సేవకులు, దైతపతులు గర్భ ఆలయం లోనికి ప్రవేశించి జయ, విజయ ద్వారం తలుపులు మూసి వేసి గోప్యంగా రాహు రేఖ అలంకరణ చేశారు. ఆలయ ఆచారం ప్రకారం ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మూల విరాటులకు మహా స్నానం చేయించారు.