
రక్తదానంపై అవగాహన అవసరం
● విరివిగా శిబిరాలు ఏర్పాటు చేయాలి
● సదస్సులో గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు
భువనేశ్వర్: రక్తదానం ఆవశ్యకతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. రాజ్ భవన్ అభిషేక్ హాల్‌లో బుధవారం భారతీయ రెడ్ క్రాస్ సంస్థ, ఒడిశా రాష్ట్ర శాఖ కార్యనిర్వాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యా సంస్థల్లో సంవత్సరానికి కనీసం రెండు, మూడు సార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరారు. రక్తదానం చేయడం అంటే మరొకరి ప్రాణాలను కాపాడటమేనని చెప్పారు. రక్తదానంపై నెలకొన్న అపోహలు తొలగించాలని సూచించారు. అనంతరం రాష్ట్రంలో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిపై సమీక్షించారు. రోగులకు రక్తం సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలు, మహిళల్లో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, పాఠశాలలు, సామూహిక విద్య విభాగం మంత్రి నిత్యానంద గోండ్, గవర్నరు కమిషనర్, కార్యదర్శి రూప రోషన్ సాహు, భారతీయ రెడ్‌క్రాస్ సంస్థ కార్యనిర్వాహక మండలి సభ్యులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పంచాయతీరాజ్, తాగునీరు, పాఠశాలలు, సామూహిక విద్య, ఉన్నత విద్యా శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.