
దోపిడీ కేసులో ఆరుగురు అరెస్టు
రాయగడ: సదరు సమితి శేశిఖాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిమిడిపేట రైల్వే స్టేషన్ వద్ద ఈ నెల 3న రైలులో ప్రయాణిస్తున్న బంగారు వ్యాపారి నుంచి 150 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించిన కేసులో ఆరుగురు నిందితులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.25 లక్షల నగదు, 58 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో స్థానిక రామకృష్ణనగర్‌కు చెందిన గోవిందబాగ్, కపిలాస్ కూడలికి చెందిన ఉల్లకల్లు శ్రీను, నెహ్రూనగర్‌కు చెందిన ఎ.బేనుగోపాల్‌స్వామి, ఉత్కళమణి నగర్‌కు చెందిన బిధిహార్‌బాగ్, రాణిగుడ ఫారానికి చెందిన పలక మురళీకృష్ణ, నెహ్రూనగర్‌కు చెందిన అగుర్ ఈశులుగా గుర్తించారు. ఈ మేరకు బుధవారం రైల్వే పోలీసులు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన ఆర్.ముళ్ల అనే నగల వ్యాపారి రాయగడకు ఇక్కడ గల బంగారు దుకాణాల యజమానులతో వ్యాపార లావాదేవీలు పూర్తయిన అనంతరం విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరాడు. జిమిడిపేట స్టేషన్ వచ్చేసరికి గుర్తు తెలియని దుండగులు వ్యాపారి వద్ద బ్యాగ్ లాక్కొని పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.