
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
● పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి
హిరమండలం: రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. ఎకరాకు 25 కిలోల యూరియా అందించాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడం ఏంటని ప్రశ్నించారు. గొట్టా బ్యారేజీలో నీటి స్థిరీకరణలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులకు ఇబ్బంది లేకుండా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులను కూటమి ప్రభుత్వ దారుణంగా వంచించిందని విమర్శించారు. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో ఎరువులు అందించకపోతే, వైఎస్సార్‌సీపీ తరుపున ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
మెరుగైన వైద్య సేవలు అందజేయాలి
టెక్కలి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. సోమవారం టెక్కలి జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అన్ని విభాగాలను పరిశీలించి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులతో మాట్లాడారు. అలాగే వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి మెరుగైన వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సిబ్బందితో మాట్లాడారు. ఆయనతో పాటు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఆస్పత్రి సూపరింటెండెంట్ సూర్యారావు, నాయకులు బి.శేషగిరి, కె.లవకుమార్, ఎం.రాము తదితరులు ఉన్నారు.
‘27లోగా దరఖాస్తు చేయండి’
అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ధర్మకర్తల పాలకమండలి నియామకాలకు దేవదాయ శాఖ నోటిఫికేషన్‌ను ఈనెల 7న విడుదల చేసిందని, ఈ మేరకు ఆసక్తి గలవారు ఈనెల 27లోగా తమ దరఖాస్తులను ఆలయానికి సమర్పించాలని ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ తెలియజేశారు. ధర్మకర్తలకు కచ్చితమైన అర్హతలుంటాయని, వీటి ప్రొఫార్మా–2 ప్రకారం దరఖాస్తులను అన్ని ధ్రువపత్రాలతో సహా కార్యాలయానికి స్వయంగా గానీ పోస్టల్ రూపంలో గానీ అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయ కార్యాలయ అడ్రస్‌కు పంపించాలని కోరారు. మరిన్ని వివరాలకు 9491000708, 8978914660 నంబర్లకు సంప్రదించాలని ఆయన తెలియజేశారు.
తాడేపల్లిలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం ధర్నా రేపు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యం సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 13న తాడేపల్లిలోని సోషల్ వెల్ఫేర్ కార్యాలయం వద్ద శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.జయరాం, ప్రధాన కార్యదర్శి పి.పెద్దిరాజు, గౌరవాధ్యక్షుడు కె.గుండారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత రెండేళ్లుగా మూడు విడతల ఆర్‌టీఎఫ్, 2024–25 విద్యాసంవత్సరానికి గాను మూడు విడతల ఆర్‌టీఎఫ్ కలిపి మొత్తంగా ఆరు విడతల ఆర్‌టీఎఫ్ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం విచారకరమన్నారు. ఈ విషయమై కూటమి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేని పక్షంలో బుధవారం ధర్నా చేయనున్నామని తెలిపారు.
మహిళ మెడలో చైన్ చోరీ
రణస్థలం: మండలంలోని అర్జునవలస పంచాయతీ పరిధి గిడిజాలపేట పరిధిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మెడలో గుర్తు తెలియని వ్యక్తి చైన్ లాక్కొని పరారైనట్లు జేఆర్‌పురం పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి చెందిన అలిగిరి శ్రీజ విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మహారాజ కళాశాలలో హోమియోపతి నర్సింగ్ చదువుతోంది. శ్రీకాకుళంలోని ఇంటి నుంచి స్కూటీపై బయల్దేరిన శ్రీజ రణస్థలం మండలంలోని అర్జునవలస పంచాయతీ పరిధి గిడిజాలపేట రహదారిపై వెళ్తుండగా, సాయంత్రం 5 గంటల సమయంలో వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మెడలోని తులం బంగారం చైన్ లాక్కొని నెల్లిమర్ల వైపు పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తెలియజేశారు.

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం