
దయా నది ఒడ్డున యువకుడి మృతదేహం లభ్యం
భువనేశ్వర్: రాజధాని భువనేశ్వర్ శివార్లలోని దయా నది ఒడ్డున సోమ వారం యువకుడి మృతదేహం గుర్తించారు. దయా పశ్చిమ కాలువ నుంచి యువకుడి మృత దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని జ్యోతి రంజన్ బెహరా (34)గా గుర్తించారు. యువకుడిని హత్య చేసి అక్కడ మృత దేహాన్ని పడేసి ఉంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుడి బైక్ సంఘటన స్థలంలోనే పడి ఉంది. ఆ యువకుడు ఆదివారం నుంచి కనిపించడం లేదు. అతడిని హత్య చేశారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాత్రి సమీపంలోని మార్కెట్‌ను సందర్శించడానికి వెళ్లిన కొడుకు ఇంటికి తిరిగి రాలేదు. రాత్రి అంతా కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోయిందని కుటుంబీకులు వాపోతున్నారు. సోమవారం ఉదయం దయా పశ్చిమ కాలువ ఒడ్డున యువకుడి మృతదేహం పడి ఉన్నట్లు దృష్టికి వచ్చింది. ఎయిర్‌ఫీల్డ్ ఠాణా పోలీసులు, సైంటిఫిక్ బృందం సంఘటనా స్థలం సందర్శించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.