పూరీ రథయాత్రకు 1000 ప్రత్యేక బస్సులు
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని రథ యాత్ర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పూరీకి 1,000 కి పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా బస్సు యజమానుల సంఘం కార్యవర్గ సభ్యులతో రాష్ట్ర రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కటక్ నగర డీసీపీ, పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, రాష్ట్ర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. సాధారణ ప్రయాణికుల బస్సులతో పాటు వివిధ వాహనాలకు ప్రత్యేక పర్మిట్లు జారీ చేస్తారు. మాలతీపట్టపూర్, తొలబొణియా మైదానాల్లో ప్రత్యేక బస్సులు నిలిపేందుకు ఏర్పాట్లు చేస్తారు. అక్కడి నుంచి భక్తులను రథ యాత్ర జరిగే బొడొదండొ ప్రాంతానికి తరలించేందుకు బ్యాటరీతో నడిచే ఆటోల్లో తరలిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా 100 ఆటోలు అందుబాటులో ఉంచుతారు. యాత్రికుల నుంచి ప్రభుత్వం నిర్ధారించిన ధర కంటే ఎక్కువ వసూలు చేయవద్దని బస్సు, ఆటో వర్గాలకు సూచించారు. తొలబొణియా బస్ స్టాప్‌లో భక్తులకు సులభంగా రూ. 10 నామమాత్రపు ధరకు స్వచ్ఛమైన శాఖాహార భోజనం సౌకర్యం కల్పిస్తారు.
వాహనాల రద్దీ నియంత్రణకు చర్యలు
శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా దాదాపు 30 ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌లను మోహరించనున్నారు. వాహనాల రద్దీ నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. భువనేశ్వర్ – పూరీ, పూరీ – కోణార్క్, పిప్పిలి – పూరీతో సహా కీలక మార్గాల్లో వాహనాల రవాణాకు అంతరాయం లేకుండా దారి పొడవునా నియంత్రణ వ్యవస్థ చురుకుగా పని చేస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్ధారించిన ధరలకే చార్జీలు వసూలు చేసేందుకు బస్సు యజమానులు అంగీకరించారని రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్ తెలిపారు.


