వాజ్‌పేయి పాలనా కాలం స్వర్ణయుగం
భువనేశ్వర్: భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పదవీకాలం భారత దేశ అభివృద్ధి ప్రయాణంలో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, అనుసంధానం, సుపరిపాలన రంగాలలో ఒక పరివర్తనాత్మక దశను సూచిస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి గురువారం అన్నారు. దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని స్థానిక లోక్ భవన్ ప్రాంగణం అభిషేక్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గవర్నరు కమిషనర్, కార్యదర్శి రూపా రోషన్ సాహు, లోక్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం డాక్టర్ కంభంపాటి మాట్లాడుతూ బంగారు చతుర్భుజ పథకం, జాతీయ రహదారుల విస్తరణ, దేశ వ్యాప్తంగా నాలుగు వరుసల రహదారుల నిర్మాణం వంటి చారిత్రాత్మక కార్యక్రమాలతో వాజ్‌పేయి పేరు విడదీయరాని విధంగా ముడిపడిందన్నారు. ఈ కార్యక్రమాలు అనేక ప్రాంతాలలో సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచి ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో వాజ్‌పేయి దార్శనికత ప్రతిబింబిస్తుంది.
గ్రామీణ అభివృద్ధికి వాజ్‌పేయి చేసిన కృషి అనిర్వచనీయమని డాక్టర్ కంభంపాటి అన్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) గ్రామాలకు నిరంతరం అనుకూలమైన రహదారి అనుసంధానాన్ని కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చడంలో, మారుమూల ప్రాంతాల ప్రజలను అభివృద్ధి ప్రధాన స్రవంతిలో చేర్చడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. నదుల అనుసంధాన దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక వ్యూహకర్తగా అటల్‌జీ ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లో ఈయనకు సభ్యత్వం కల్పించిన సదవకాశాన్ని గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. డాక్టర్ కంభంపాటి, వాజ్‌పేయిని ఒక దార్శనిక రాజనీతిజ్ఞుడిగా, గొప్ప వక్తగా మరియు పార్టీలకు అతీతంగా గౌరవాన్ని పొందిన నాయకుడిగా అభివర్ణించారు. మాజీ ప్రధాని సమ్మిళిత అభివృద్ధి, సుపరిపాలన యొక్క శాశ్వత వారసత్వాన్ని వదిలి వెళ్లారు. అది దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉందని ఆయన అన్నారు.
వాజ్‌పేయి పాలనా కాలం స్వర్ణయుగం
వాజ్‌పేయి పాలనా కాలం స్వర్ణయుగం


