రాష్ట్రంపై పొగమంచు
భువనేశ్వర్: తీవ్రమైన చలి కారణంగా రాష్ట్రంలో దట్టమైన పొగమంచు కమ్ముతుంది. పొగ మంచు దుప్పటి లోగిలిలో నింగి నేల ఏకమైన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో భువనేశ్వర్, కటక్ జంట నగరాల్లో సైతం పొగ మంచు ప్రభావంతో ప్రజా జీవనం కదలిక మందగించింది. పూరీ, సుందర్‌గఢ్, కంధమల్, కలహండి, కొరాపుట్ తదితర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలముకుంది. ఆయా ప్రాంతాల్లో దృశ్యమాన్యత దిగజారింది. గురువారం ఉదయం తీవ్రమైన చలితో పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఇది సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేసింది. భువనేశ్వర్, కటక్ జంట నగరాలతో సహా అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమాన్యత బాగా తగ్గడంతో జాతీయ రహదారులు, ఇతర బాటల్లో ద్విచక్ర వాహనాలు, బస్సులు వంటి భారీ మోటారు వాహనాల కదలిక నెమ్మదిగా కొనసాగుతుది. కొన్ని ప్రాంతాల్లో దృశ్యమాన్యత దూరం దాదాపు 50 మీటర్లకు తగ్గినట్లు సమాచారం.
పొగ మంచు మాటున పతిత పావన పతాకం
పూరీ ప్రాంతంలో అల్లంత దూరం నుంచి శ్రీ మందిరం శిఖరాన రాత్రింబవళ్లు రెపరెపలాడుతు తారసపడే పతిత పావన పతాకం దట్టమైన పొగమంచు మాటున కనుమరుగైంది. పర్యాటకులు, సందర్శకులు, యాత్రికులు గిలి కొడుతున్న చలిలో ప్రత్యేక అనుభూతి ఆస్వాదిస్తున్నారు. సుందర్‌గఢ్, కంధమల్, కలహండి మరియు కొరాపుట్ వంటి గిరిజన ప్రాబల్య జిల్లాల్లో పొగమంచు చాటున ప్రధాన మరియు అంతర్గత రహదారులపై సాధారణ రవాణా బిక్కు బిక్కుమని కొనసాగుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చలిగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాతావరణ అధికారుల సమాచారం ప్రకారం తక్షణ ఉపశమనం లభించే అవకాశం లేదు. రాష్ట్రం అంతటా కనిష్ట ఉష్ణోగ్రతల్లో వచ్చే వారం వరకు పెద్దగా మారవు. ముఖ్యంగా లోతట్టు మరియు అటవీ ప్రాంతాలలో ప్రస్తుత ఒణికించే చలి రాత్రులు మరియు పొగమంచు ఉదయం నిరవధికంగా కొనసాగే అవకాశం ఉంది.
రాష్ట్రంపై పొగమంచు


