● జేకే పేపర్ మిల్‌పై యాజమాన్యంపై ఎమ్మెల్యే కడ్రక ఆగ్రహం
రాయగడ: జిల్లాలోని సదరు సమితి పరిధిలో ఉన్న జేకే పేపర్ మిల్ యాజమాన్యం చందిలి మీదుగా ప్రవహిస్తున్న నాగావళి నదినీటిని అడ్డుకట్ట వేసి తన అవసరాలకు వినియోగిస్తున్న తరువాత వాటి వ్యర్థాలను తిరిగి నదిలోకి విడిచి పెట్టడం ఎంతవరకు సమంజసమని రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక ధ్వజమెత్తారు. నాగావళి పరిసరాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగావళి నది నీటిపై దిగువన గల వందలాది గ్రామాలకు చెందిన ప్రజలు మంచినీటి కోసం ఆధారపడుతుంటారన్నారు. అయితే కొన్నాళ్లుగా జేకేపేపర్ మిల్ యాజమాన్యం తన అవసరాల కోసం నది వద్ద ఇసుక బస్తాలను వేసి నీటిని నిలిపి వేస్తుండటంతొ దిగువ ప్రాంతాల్లో గల వారికి తాగునీటి సమస్య తలెత్తుతుందని అన్నారు. కాగా కాస్త విడిచి పెడుతున్న నది నీటిలో పేపర్ తయారీకి సంబంధించి వినియోగించిన కెమికల్స్‌ను, వ్యర్థాలను నదిలో విడిచి పెడుతుండటంతో నదినీటిపై ఆధారపడుతున్న గ్రామస్తులు అదే నీటిని తాగా వ్యాధులబారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలొ ఇదే విషయమై ప్రశ్నోత్తరాల్లో భాగంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. దీనికి సమాధానంగా సంబంధిత శాఖ మంత్రి వివరణ ప్రకారం.. ప్రవహించే నదినీటిని ఏ ప్రైవేటు పరిశ్రమలు, ఇతరులు నీటిని అడ్డగించి స్వప్రయోజనాలకు వినియోగించే అధికారం లేదని స్పష్టం చేశారని అన్నారు. కాని జేకేపేపర్ మిల్ యాజమాన్యం నాగావళి నదిలో ఇసుక బస్తాలను వేసి అత్యధిక శాతం నీటిని స్వప్రయోజనాలకు వినియోగిస్తుందని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పక్షం రోజుల్లో సమస్యను పరిష్కరించకపొతే నది వద్దే బాధిత గ్రామాల ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు నదిలో పర్యటించిన ఎమ్మెల్యే కడ్రక జేకేపేపర్ మిల్ యాజమాన్యం నాగావళి నది నీటిని ఎలా కట్టడి చేసి నిల్వ చేసుకుని స్వప్రయోజనాలకు వినియోగిస్తుందో ఆరా తీశారు.
‘నాగావళి’కి అడ్డుకట్ట సమంజసం కాదు


