భువనేశ్వర్ స్టేషన్ వద్ద హై అలర్ట్
భువనేశ్వర్: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో నగరంలో రైల్వేస్టేషన్ల వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతా చర్యలు పటిష్టపరిచారు. ఆయా ప్రాంగణాల్లో ప్రయాణికులు, సిబ్బంది ఇతరేతర ప్రజలకు ఏమాత్రం భద్రత లోపించకుండా అవాంఛనీయ సంఘటనల నివారణకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లలో భాగంగా రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) సిబ్బంది సోమవారం స్థానిక రైల్వే స్టేషన్‌లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ఫామ్‌ల వద్ద ఎవరైనా అనుమానాస్పద వ్యక్తి లేదా ఏదైనా సందిగ్ధ సామాన్లు చూస్తే తెలియజేయాలని ప్రయాణికులకు ఆర్పీఎఫ్ అధికారు లు కోరారు. ప్రయాణికులను లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ పరిశీలనలో అధునాతన నిఘా వ్యవస్థలను ఉపయోగించి ప్రయాణికుల కదలికలను పర్యవేక్షించేందకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రవేశ, నిష్క్రమణ ప్రాంగణాలు, ప్లాట్ ఫారమ్, పార్కింగ్ ప్రాంతాల వద్ద అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆయా ప్రాంగణాల్లో నిఘాను బలోపేతం చేశారు. ప్రజల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. తనిఖీల సమయంలో భద్రతా సిబ్బందికి సహకరించాలని, ఏవైనా లగేజీలు లేకపోవడాన్ని లేదా అనుమానాస్పద ప్రవర్తనను వెంటనే నివేదించాలని ప్రయాణికులను అభ్యర్థించారు. భద్రతా స్క్రీనింగ్ కోసం అవసరమైన అదనపు సమయం కేటాయించేందుకు ప్రయాణికులు స్టేషన్‌కు రైలు ప్రయాణం సమయం కంటే ముందుగానే స్టేషనుకు చేరుకోవాలని రక్షణ అధికారులు అభ్యర్థించారు.


