అనాథాశ్రమం ప్రారంభం
పర్లాకిమిడి: అనాథ పిల్లలను చేరదీసి వారికి ఆహారం, ప్రాథమిక వైద్యం, విద్యను అందించేందుకు అనాథాశ్రమాన్ని పీపుల్ ఫార్వర్డ్ ఫౌండేషన్ సంస్థ గజపతి జిల్లా రాయఘడ బ్లాక్‌లో డోంబాల్ పంచాయతీ మండల సాయి వద్ద ఆదివారం జిల్లా ఎస్పీ జ్యోతింద్ర నాథ్ పండా ప్రారంభించారు. ఈ అనాథ ఆశ్రమం ప్రారంభోత్సవానికి డోంబాలో పంచాయతీ సర్పంచు బిశ్వనాథ భుయ్యాన్, సంస్థ అధ్యక్షురాలు బినీతా పండా, కార్యదర్శి సత్యజిత్ బరువా, జిరంగో పొలీసుస్టేషన్ అధికారి బి.రమణ, స్థానికులు పాల్గొన్నారు. గజపతి జిల్లా నుంచి వచ్చిన అనాథ పిల్లలను భువనేశ్వర్‌లో పీపుల్ ఫార్వర్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలుత ప్రారంభించారు. అనంతరం గజపతిజిల్లా రాయఘడ బ్లాక్ మండల సాయిలో ప్రారంభిస్తున్నందుకు జిల్లా ఎస్పీ జ్యోతింద్రనాథ్ పండా అభినందించారు. ప్రస్తుతం మండల సాయి అనాథ హోస్టల్‌లో 20 మంది బాలలు ఉంటున్నారు. వారికి అన్నివిధాలా సహాయ సహాకారాలు అందిస్తామని జిల్లా ఎస్పీ పండా అన్నారు.
ఆయుష్మాన్ కార్డులు పంపిణీ
కొరాపుట్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ఆయుస్మాన్ ఆరోగ్య బీమా కార్డుల పంపిణీ ప్రక్రియ జోరుగా జరుగుతోంది. ఆదివారం కొరాపుట్ జిల్లా సునాబెడా పట్టణంలోని 18వ వార్డులో పంపిణీ చేపట్టారు. కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. గతంలో ఉన్న బీజూ ఆరోగ్య బీమా కార్డులను తొలగించి కొత్త ప్రభుత్వం వీటిని అమలు లోనికి తెచ్చింది. ఈ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి రూ. 10 లక్షల వరకూ వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది.
పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు
ఎచ్చెర్ల క్యాంపస్: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్–2025 ప్రవేశ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశాల ఇన్‌చార్జి బి.జానకిరామ య్య ఆదివారం చెప్పారు. శ్రీకాకుళం, టెక్కలి రెండు డివిజన్లలో పరీక్ష నిర్వహణ ఈ నెల 30న ఉంటుందని అన్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 25 పరీక్ష కేంద్రాల్లో 6952 మంది, టెక్కలి డివిజన్‌లో 14 పరీక్ష కేంద్రాల్లో 4500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నా రని చెప్పారు. జిల్లాలో మొత్తం 39 పరీక్ష కేంద్రాల్లో 11,452 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని వెల్లడించారు. విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు.
రేపు జిల్లా స్థాయి అండర్–23 బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు
శ్రీకాకుళం అర్బన్: జిల్లాస్థాయి అండర్–23 బాలబాలికల బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు ఈనెల 29వ తేదీన జరుగుతాయని బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ మైదానం వేదికగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఎంపికలు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ఎంపికల్లో పాల్గొ న్న బాల, బాలికలు 23 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. బాస్కెట్‌బాల్ కోచ్ జి.అర్జున్ రెడ్డి మాట్లాడుతూ ఎంపికలలో పాల్గొన్న క్రీడాకారులు విధిగా తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9949291288 నంబర్‌ను సంప్రదించాలని వారు కోరారు.


