సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

Apr 13 2025 1:32 AM | Updated on Apr 13 2025 1:32 AM

సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

● భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహరావు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వి.నర్సింహరావు కోరారు. శ్రీకాకుళం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్‌ క్‌లైయిమ్స్‌ పరిష్కరిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లు అమలు చేయడానికి పూనుకోకపోవడం దారుణమన్నారు. కార్మిక వర్గాన్ని నమ్మించి మోసగించడం పాలకులకు పరిపాటిగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని, భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తోందని విమర్శించారు.

లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల సంక్షేమ పథకాల అమలు కోసం ఉద్దేశించి వసూలు చేసిన సెస్‌ నిధులను, కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేయాలని సూచించారు. ప్రభుత్వాలు వివిధ సందర్భాల్లో అక్రమంగా తీసుకున్న వెల్ఫేర్‌ బోర్డు నిధులను తక్షణమే తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు గృహ నిర్మాణాల వెల్ఫేర్‌ బోర్డు ద్వారా సబ్సిడీతో కూడిన రుణం ఇప్పించాలన్నారు. కార్మికుల పిల్లలకు స్కాలర్‌ షిప్‌ అందించాలని, పనిచేసే ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిర్మాణాల్లో ఉపయోగించే వస్తువులపై (ముడి సరుకులు) జీఎస్టీ తగ్గించాలని విన్నవించారు. నిర్ల్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా, భవన నిర్మాణ కార్మిక సంఘం, సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 24వ తేదీన కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలియజేశారు. అన్ని మండలాల్లోని నిర్మాణ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహరావు, ఏపీ బిల్డింగ్‌ అదర్‌ కన్స్‌ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.హరనాథరావు, గౌరవాధ్యక్షుడు ఎం.ఆదినారాయణమూర్తి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement