● ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్
విజయనగరం గంటస్తంభం: స్మార్ట్‌మీటర్లు తీసుకొచ్చి వేలాది మంది విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే కార్మికుల పొట్ట కొట్టొద్దని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. గురువారం స్థానిక దాసన్నపేటలోని విద్యుత్ భవన్ ముందు మీటర్ రీడర్స్ యూనియన్ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల్లో సుమారు 4500 మంది విద్యుత్ మీటర్ రీడర్స్ 20 సంవత్సరాలుగా పని చేస్తున్నారన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో కార్మికులందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పారు. గతంలో చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్‌మీటర్లను వ్యతిరేకించి.. నేడు బీజేపీతో జత కట్టడం సిగ్గుచేటన్నారు. ఒక్కో సర్వీస్‌కు కేవలం రూ.3.60 పీస్ రేటుతో నెలకు రూ. 6 నుంచి 10 వేల రూపాయల లోపు మాత్రమే వేతనం పొందుతున్న రీడర్స్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. మీటర్ రీడర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్‌లో ఆందోళనలను ఉధృతం చేస్తామని చెప్పారు. సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాసరావు, పసుమర్తి శ్రీకాంత్, (ఎస్.కోట సబ్ డివిజన్), విజయనగరం సబ్ డివిజన్ గోక రమణ, (గజపతినగరం సబ్ డివిజన్) ఆది, రీడింగ్ కార్మికులు పాల్గొన్నారు.