● రడీమేడ్ వైపు ప్రజల దృష్టి ● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ‘జగనన్న చేదోడు’తో భరోసా
● ఆదుకోని కూటమి ప్రభుత్వం ● నేడు ప్రపంచ టైలర్ల దినోత్సవం
దర్జా
కోల్పోయిన
రాజాం సిటీ: సమాజంలో హుందాగా కనిపించాలంటే దుస్తులే ప్రధానం. పండగలు, శుభకార్యాలు, చిన్నచిన్న కార్యక్రమాలు ఏవైనా సరే టైలర్లకు చేతి నిండా పని ఉండేది. కొత్త దుస్తులు కుట్టించుకునేందుకు టైలర్ల వద్దకు క్యూ కట్టేవారు. గతంలో వీరి పరిస్థితి దర్జాగా ఉండేది. అటువంటిది కాలక్రమంలో మార్కెట్‌లోకి పలు ఫ్యాషన్లు, డిజైన్లతో కూడిన రడీమేడ్ వస్త్రాలు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం టైలర్లకు ఉపాధి కరువైంది. గతంలో దర్జాగా బతికే వారి జీవితాల్లో దర్జా లేకుండా పోవడమే కాకుండా కులవృత్తినే నమ్ముకున్న వారి పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. నేడు ప్రపంచ టైలర్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ఫ్యాషన్ వైపు పరుగులు
టైలర్ వృత్తి రోజురోజుకీ అనేక మార్పులకు గురౌతు వచ్చింది. ఇప్పడు ఫ్యాషన్ టెక్నాలజీలో భాగంగా మారిపోవడంతో పాత కుట్టుమిషన్ల స్థానంలో అత్యాధునిక మిషన్లు వచ్చాయి. కంప్యూటర్లు ప్రవేశంతో ఎలాంటి డిజైన్ అయినా అలవొకగా తీర్చిదిద్దే విజ్ఞానం అందుబాటులోకి వచ్చేసింది. నేటి యువతతో పాటు మధ్య వయసు వారు సైతం ఎక్కువగా టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు ధరిస్తున్నారు. షాపింగ్ మాల్స్‌లో అయితే ఆఫర్ల పేరుతో వల వేస్తుండడంతో ఫ్యాంట్లు, షర్టులు సైతం రడీమేడ్ కొనుగోలు చేస్తున్నారు. అతి కొద్ది మంది మాత్రమే టైలర్ల వద్ద దుస్తులు కుట్టించుకుంటున్నారు. దీంతో టైలర్లకు పెద్దగా పనిలేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు పండుగల సమయంలో ఇంటిల్లపాది కొత్త దుస్తులు కోసం క్లాత్‌లు తెచ్చుకుని టైలర్ల వద్ద కుట్టించుకునేవారు. దీంతో తినడానికి సమయం లేని స్థితి నుంచి నేడు దయనీయ స్థితికి టైలర్లు చేరుకున్నారు.
నాడు జగనన్న చేదోడుతో బాసట
కష్టాల్లో నలిగిపోతున్న టైలర్లను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదుకుంది. టైలర్ల కోసం ‘జగనన్న చేదోడు’ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించింది. ప్రతి టైలర్‌కు ఏటా రూ.10వేలు ఆర్థిక సాయం అందించింది. టైలర్లకు ఈ పథకం కొంతమేర వెసులుబాటు కల్పించింది. ప్రతి విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాం క్లాత్‌ను ప్రభుత్వం అందించి కుట్టు కూలి డబ్బులను తల్లుల ఖాతాలో జమ చేస్తూ వచ్చింది. యూనిఫాం ప్రభుత్వం కుట్టించి ఇవ్వకుండా క్లాత్ మాత్రమే ఇవ్వడంతో టైలర్లకు వారికి పని కల్పించడంతో పాటు మేలు జరిగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం టైలర్ల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. కనీసం గతంలో మాదిరిగా విద్యార్థులకు క్లాత్ ఇస్తే కొంతవరకై నా తమకు ఉపాధి లభిస్తుందని టైలర్లు అభిప్రాయపడుతున్నారు.
వెలవెలబోతున్న టైలరింగ్ షాపులు
గ్రామ స్థాయి నుంచి పట్టణం వరకు ప్రతి చోటా టైలర్లు ఉన్నారు. షాపుల ద్వారా కొందరు... ఇళ్లల్లోనే మరికొందరు వస్త్రాలు కుడుతున్నారు. నియోజకవర్గంలో సుమారుగా 350 మంది వరకు దర్జీ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రెడీమేడ్ దుస్తులు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చేస్తుండడంతో వస్త్రం తీసుకుని టైలర్ల వద్ద కుట్టించుకునేవారు తగ్గిపోయారు. దుస్తులు కుట్టించుకునేందుకు ఎవరు వస్తారా.. అని టైలర్లు ఎదురుచూసే పరిస్థితులు వచ్చాయి. ఇదిలా ఉంటే కుటుంబ పోషణతో పాటు షాపుల అద్దెలు చెల్లించేంత సంపాదన లేక దీన స్థితిలో బతుకీడుస్తున్నారు.
కుట్టు పనిలో టైలర్