సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ నాగలక్ష్మి
సాక్షి ప్రతినిధి విజయనగరం: ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలక ప్రక్రియ అని, ప్రజారోగ్యానికి భంగం కలగకుండా వీటిని జాగ్రత్తగా తరలించాలని కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా పర్యవేక్షక కమిటీ సమీక్ష సమావేశం జరింది. ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణకు జిల్లాలో తీసుకున్న చర్యలను పొల్యూషన్ ఇంజినీర్ బి.బి.సరిత వివరించారు. ప్రతి ఆస్పత్రిలో నిర్దేశిత రంగంలో ప్రత్యేక చెత్త బుట్టలను ఏర్పాటు చేసి, వ్యర్థాలను వాటిల్లోనే వేయాల్సి ఉంటుందన్నారు. అనుమతి పొందిన సంస్థ ద్వారా 48 గంటల్లో చెత్తను భద్రంగా తరలించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు, ప్రభుత్వాస్పత్రులు కూడా వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆస్పత్రి వ్యర్థాలు బయటి వ్యర్థాలతో కలిపి ఎక్కడికక్కడ పడేస్తే వివిధ రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. వ్యర్థాల తరలింపులో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించేలా ఆస్పత్రి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. శిక్షణ ఇచ్చిన తరువాత ఆస్పత్రులను తనిఖీచేసి, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ వెంకట త్రివినాగ్, మున్సిపల్ కమిషనర్లు, వైద్య ఆరోగ్య శాఖాధికారులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ నాగలక్ష్మి


