చల్లపల్లి: కార్తిక మాసం సందర్భంగా చల్లపల్లిలోని శ్రీఅన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఉదయం ఐదు అడుగుల పొడవైన భారీ అగర్‌బత్తీని వెలిగించారు. ఈ భారీ అగరబత్తీ ఆలయానికి వచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
చెప్పుల స్టాండ్ కాంట్రాక్టు సిబ్బంది తొలగింపు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఆధ్వర్యంలో నడుపుతున్న చెప్పులస్టాండ్, క్లోక్‌రూమ్‌లలో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని సోమవారం నుంచి తొలగించారు. ఓంటర్నింగ్, కనకదుర్గనగర్‌లో చెప్పులస్టాండ్, క్లోక్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కొంత కాలంగా ఆ కౌంటర్లలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బంది భక్తుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో దేవస్థానం ఆయా సిబ్బందిని తొలగించి సెక్యూరిటీ గార్డుల సేవలను కౌంటర్లలో వినియోగించుకుంటోంది.
లబ్బీపేట(విజయవాడతూర్పు): తిరువూరు వైష్ణవి హాస్పిటల్‌లో ఈ నెల 11న ప్రసవానంతరం పరిస్థితి విషమించి బాలింత మృతి చెందడంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు ఆధ్వర్యంలో సోమవారం సమీక్ష జరిపారు. మహిళ 3.1 కిలోల ఆడ శిశువుకు జన్మనిచ్చిన అనంతరం తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా ఈ నెల 15వ తేదీన మృతిచెందింది. మాతృ మరణానికి దారితీసిన కారణాలు, చికిత్సా విధానం, రిఫరల్ ప్రక్రియ, వైద్య సేవల్లోని లోపాలపై నిపుణుల బృందం సమగ్రంగా సమీక్షించారు. భవిష్యత్తులో మాతృ మరణాలు పునరావృతం కాకుండా అవసరమైన నివారణ చర్యలు, మెరుగైన వైద్య సేవలపై చర్చించారు. డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఇంధుమతీదేవి, డీఐఓ డాక్టర్ శరత్‌బాబు, జీజీహెచ్ వైద్యులు, పీహెచ్‌సీ వైద్యులు, స్పెషలిస్టు వైద్యులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ
యువకుడి మృతి
భవానీపురం(విజయవాడపశ్చిమ): రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు పరిస్థితి విషమించి సోమ వారం మృతి చెందాడు. భవానీపురం పోలీసుల కథనం మేరకు.. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి నాగార్జున స్కూల్ రోడ్డులో నివసించే పొన్నూరి నాగమల్లేశ్వరి హోటళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు భర్తతో విభేదాలు రావడంతో ఆరేళ్ల క్రితం విడిపోయింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఇంటి వద్ద వేరే ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తోంది. ఆమెకు కొంత కాలం కిందట విజయవాడ బస్టాండ్ వద్ద పండు (26) పరిచయమయ్యాడు. అతను తరచూ నాగమల్లేశ్వరి ఇంటికి వచ్చేవాడు. ఆమె ఇటీవల ద్విచక్రవాహనం కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీ తెల్లవారు జాము ఐదు గంటల సమయంలో పండు నాగమల్లేశ్వరి ఇంటికి వచ్చాడు. కొత్త వాహనానికి పూజ చేయించేందుకు అదే వాహనంపై నాగమల్లేశ్వరి, ఆమె కుమార్తెతో కలిసి పండు కొండపల్లి నుంచి ద్వారకా తిరుమలకు బయలుదేరాడు. గొల్లపూడి ఆంధ్రాహాస్పిటల్ దాటి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్దకు వచ్చేసరికి పండు కళ్లు తిరిగి బండితో కింద పడిపోయాడు. నాగమల్లేశ్వరి, ఆమె కుమార్తె కూడా పడిపోయారు. పండు తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికుల అందించిన సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి పండును విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న పండు పరిస్థితి విషమించి సోమ వారం వేకువ జామున మృతి చెందాడు. నాగ మల్లేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.


