కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నం మండలం మంగినపూడి, కోడూరు మండలంలోని హంసలదీవి బీచ్‌లలో మంగళవారం జరిగే కార్తిక పౌర్ణమి పుణ్య స్నానాలను పురస్కరించుకుని కృష్ణా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. 500 మంది పోలీసులకు బందోబస్తు బాధ్యతలు అప్పగించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో పాటు హోంగార్డులు, మహిళా కానిస్టేబుళ్లు బందరు, అవనిగడ్డ డీఎస్పీలు ఆవుల శ్రీనివాసరావు, అభిషేక్‌ల ఆధ్వర్యంలో బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. మంగినపూడిబీచ్‌లో 200 మంది, చిలకలపూడి శ్రీపాండురంగస్వామి ఆలయం వద్ద బందోబస్తు నిమిత్తం 150 మందిని నియమించారు. హంసలదీవి బీచ్ వద్ద మరో 150 మంది పోలీసులను నియమించారు. మచిలీ పట్నం పోలీసు కల్యాణ మండ పంలో ఎస్పీ ఆదేశాల మేరకు బందరు రూరల్ సీఐ ఏసుబాబు, అవనిగడ్డ సీఐ యువకుమార్ సిబ్బందితో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించి బందోబస్తు నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
నిరంతర పర్యవేక్షణ
మంగినపూడి, హంసలదీవి బీచ్‌ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు లక్షల్లో వచ్చే అవకాశం ఉండటంతో వారి రక్షణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సముద్ర తీరం వెంబడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. భక్తుల ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు మంగినపూడి బీచ్ సమీపంలో మూడు పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. బీచ్ అవుట్‌పోస్టు పోలీస్‌స్టేషన్ వెనుక ఖాళీ ప్రదేశంతో పాటు మేరీమాత చర్చి సమీపంలో మరో పార్కింగ్, గిరి పురం సమీపంలో ఇంకో పార్కింగ్ ఏర్పాటుచేశారు. హంసలదీవి బీచ్ సమీపంలోని డాల్ఫిన్‌కు కుడి, ఎడమ భాగాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాలు, ఆలయం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని పార్కింగ్‌కు కేటాయించారు.


