అజిత్‌సింగ్‌నగర్‌లో కారు బీభత్సం | - | Sakshi
Sakshi News home page

అజిత్‌సింగ్‌నగర్‌లో కారు బీభత్సం

Nov 24 2026 1:48 AM | Updated on Nov 24 2026 1:48 AM

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌ బ్రేకుకు బదులుగా ఎక్స్‌లేటర్‌ను తొక్కడంతో ఒక్కసారిగా కారు అదుపుతప్పి రోడ్డుపై నడుస్తున్న బాలుడిని ఢీకొని పక్కనున్న ఖాళీ స్థలాల్లోకి దూసుకెళ్లింది. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది. పెనమలూరు మండలంలోని కానూరు, యనమలకుదురు ప్రాంతాలకు చెందిన దాసరి నిఖిల్‌(23), చింతా నాగసాయికిరణ్‌ (20), సోడాబత్తుల సాయికార్తీక్‌ (20), బోయిన నాగ వీరేంద్ర(19) ఆదివారం రాత్రి అజిత్‌ సింగ్‌నగర్‌లో జరిగిన అయ్యప్పస్వామి భజన కార్యక్రమానికి హాజరయ్యేందుకు కారులో వచ్చారు. రాత్రి సుమారు 11 గంటలు దాటిన తరువాత భజన ముగించుకొని తిరిగి ఇంటికి బయల్దేరారు. రామకృష్ణాపురం మీదుగా బీఆర్టీఎస్‌ రోడ్డుకు వెళ్లేందుకు కారును తిప్పారు. సింగ్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ కింద గుజ్జల సరళాదేవి కల్యాణ మండపం వద్ద స్పీడ్‌ బ్రేకర్‌ కనిపించడంతో డ్రైవర్‌ సడెన్‌గా బ్రేకుకు బదులు ఎక్స్‌లేటర్‌ను తొక్కడంతో ఒక్కసారిగా కారు అదుపుతప్పి రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఏడో తరగతి విద్యార్థి నాగిరెడ్డి మణిదీప్‌పైకి దూసుకువచ్చింది. అప్రమత్తమైన డ్రైవర్‌ బాలుడిని చేతిని తాకుతూ పక్కనున్న ఖాళీ స్థలంలోకి తిప్పేశాడు. అక్కడ ఇసుక ఎక్కువగా ఉండటంతో ఎదురుగా రెండడుగుల ఎత్తులో ఉన్న రోడ్డును ఢీకొని కారు ఆగిపోవడంతో స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. భజనకు వచ్చిన భక్తుల రోడ్డుపై నడిచి వెళ్తున్నారని, కారు రోడ్డుపైకి దూసుకువెళ్లి ఉంటే ప్రాణనష్టం వాటిల్లేదని స్థానికులు పేర్కొన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులను వివరణ కోరగా ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని, బాలుడికి కొద్దిపాటి గాయాలయ్యాయని పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement