ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.94 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 21 రోజులకు గాను అమ్మవారి ప్రధాన ఆలయం ఆలయ ప్రాంగణంలోని హుండీల ద్వారా రూ.3,94,31,637 కోట్ల నగదు లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. లభించిన ఆదాయంలో రూ.3,77,11,637 నోట్లుగాను, రూ.17.20 లక్షలు నాణేలుగా వచ్చాయన్నారు. 321 గ్రాముల బంగారం, 3.190 కిలోల వెండి లభించినట్టు ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. కానుకల లెక్కింపును ఆలయ ఈవోతో పాటు ఏసీ రంగారావు, ఏఈవో ఎన్.రమేష్‌బాబు, చంద్రశేఖర్, దేవదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు. లెక్కింపులో ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం, ఊటుకూరు పీహెచ్‌సీలను బుధవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు సందర్శించారు. అక్కడ అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, ఆరోగ్య కార్యక్రమాల అమలును పరిశీలించారు. సిబ్బంది హాజరు వివరాలు, రోగుల నమోదు రిజిస్టర్లను తనిఖీ చేశారు. లాబొరేటరీని సందర్శించి రోజు వారీగా నిర్వహిస్తున్న రక్త పరీక్షల సంఖ్య, రక్త నమూనాల సేకరణ, పరీక్షల ఫలితాలను రోగులకు సకాలంలో అందిస్తున్నారా లేదా అనే విషయాలను పరిశీలించారు. ఫార్మసీలో మందుల లభ్యత, రోగులకు పంపిణీ చేస్తున్న మందుల వివరాలు, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. మందుల గడువు తేదీలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ, గడువు ముగిసే మందులను గుర్తించాలని, మూడు నెలలకు సరిపడా మందుల నిల్వలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన అనంతరం మొత్తం 3156 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లాలోని విజయవాడ, తిరువూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఐదు మండలాల్లో 73 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 856 వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలన అనంతరం వీటిలో మొత్తం 435 మంది సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు, 2,721 మంది వార్డు సభ్యుల అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు ఆయన వివరించారు.
పెడన: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలకు రూ.200 జరిమానాతో ఈ నెలాఖరు వరకు అవకాశం ఉందని కృష్ణాజిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఎ.విజయలక్ష్మి తెలిపారు. పెడనలోని బంగ్లా స్కూల్ వద్ద గల మండల విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఎంఈవో– 2 వై.హరనాథ్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం దూర విద్య ఆవశ్యకతపై ప్రచార కరపత్రాలను ప్రదర్శించారు.


