రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ విష్ణువర్ధన్
సాక్షి ప్రచురించిన స‘మాయ’పాలన వార్తకు స్పందించిన డీఎంఈ
ఉదయం 10 గంటలకే జీజీహెచ్‌కి వచ్చిన వైనం
మధ్యాహ్నం 1.30 వరకూ ఆస్పత్రిలోనే..
సిబ్బంది అటెండెన్స్, ఎఫ్ఆర్ఎస్ పరిశీలన
30 శాతం పైగా సిబ్బంది ఆలస్యంగా విధులకు వస్తున్నట్లు గుర్తింపు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాల్సిందేనని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. ఆస్పత్రి పర్యవేక్షణ అధికారులు నిత్యం ఎఫ్‌ఆర్‌ఎస్‌ను తనిఖీ చేసి, ఆలస్యంగా వచ్చిన వారిని గుర్తించాలని పేర్కొన్నారు. ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన స‘మాయ’పాలన కథనానికి ఆయన స్పందించారు. ఉదయం 10 గంటలకే ప్రభుత్వాస్పత్రికి చేరుకుని సూపరింటెండెంట్ రూమ్‌లో కూర్చున్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఆస్పత్రిలోనే ఉన్న ఆయన వైద్యులు, సిబ్బంది అటెండెన్స్, ఎఫ్‌ఆర్‌ఎస్‌ను పరిశీలించారు.
సిబ్బంది ఆలస్యంగా వస్తున్నారని..
ప్రభుత్వాస్పత్రి సిబ్బందిలో 30 శాతం మంది విధులకు ఆలస్యంగా వస్తున్నట్లు డీఎంఈ పరిశీలనలో తేలింది. సిబ్బంది, వైద్యుల ఎఫ్‌ఆర్‌ఎస్‌ను పరిశీలించి, ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇంత మంది ఆలస్యంగా వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని డీఎంఈ ప్రశ్నించినట్లు తెలిసింది. ఆలస్యంగా వచ్చిన వారి వివరాలు నమోదు చేసుకున్నారు.
తీరు మారాలి
వైద్యులు, సిబ్బంది తీరులో మార్పు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డ్యూటీ సమయంలో కచ్చితంగా విధుల్లోనే ఉండేలా చూడాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెగ్యులర్‌గా ఆలస్యంగా వచ్చే వారిపై చర్యలు ఉండాలని అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అప్పారావుకు సూచించారు. డీఎంఈ వచ్చిన సమయంలో ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ, ఆర్ఎంఓ డాక్టర్ పద్మావతి, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది ఉన్నారు.


