గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో మండల ప్రజా పరిషత్‌లకు సంబంధించి కో–ఆప్టెడ్ సభ్యుల ఎన్నికతో పాటు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పి. సుశీల ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. గురువారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీవోలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుశీల మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు బాధ్యతలను పూర్తి అవగాహనతో నిర్వర్తించాలని తెలిపారు. ఎన్నిక విధివిధానాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నోటీసుల జారీ, సమావేశాలకు అవసరమైన కోరం నిర్ధారణ, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ,ఓటింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతలను నిర్ణయించే విధానం, రాజకీయ పార్టీల అభ్యర్థుల అధికారిక గుర్తింపు పత్రాలు, పార్టీ విప్ జారీ, విప్ అమలు, ఎన్నికల సమావేశాల నిర్వహణ, ఫలితాల ప్రకటన, సంబంధిత రికార్డుల నిర్వహణపై కూడా అధికారులకు వివరించారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. శిక్షణలో ఆయా మండలాల ఎంపీడీవోలు, ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జెడ్పీ సీఈఓ సుశీల


