కట్టలేరు వంతెన.. 20 గ్రామాల ప్రజలకు ప్రయోజనకరం. సుమారు ఎనిమిదేళ్ల క్రితం అధిక వర్షాలకు అది ధ్వంసమైంది. నాటి నుంచి నేటి వరకూ దానికి మరమ్మతులు చేయలేదు.. కొత్తదీ నిర్మించలేదు. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు కేవలం ఫర్లాంగు దూరానికి 25కిలోమీటర్లు దూరం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత పాలకులు దెబ్బతిన్న వంతెన పక్కనే తాత్కాలిక రహదారి ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేకసార్లు వర్షాలకు ఆ రహదారి కూడా కొట్టుకుపోవడంతో వారాల తరబడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల వచ్చిన తుపాను నేపథ్యంలో మళ్లీ తాత్కాలిక రహదారిపై మట్టి కొట్టుకుపోయి సూదంటి రాళ్లు తేలి, కాలినడకకు సైతం కష్టతరంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా పాలకులు దీనిపై స్పందించి, కనీసం తాత్కాలిక రోడ్డు మార్గాన్నైనా పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. – గంపలగూడెం


