ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తిక మాస విశేష పూజలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో సంకల్ప దీక్ష, గణపతి పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈవో శీనానాయక్ నిర్వహించారు. కాఠక పారాయణలు, శివ పంచాక్షరీ, లక్ష్మీగణపతి జపాలను ఆలయ అర్చకులు నిర్వహించగా, ప్రధాన ఆలయంలో మల్లేశ్వరస్వామి వారికి త్రికాల అర్చనలు జరిగాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు, అభిషేకాలు జరిపించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు పాల్గొన్నారు. ప్రదోషకాలంలో స్వామి వారికి మహా నివేదన, పంచహారతుల సేవ, చతుర్వేద స్వస్తి జరిగాయి. సాయంత్రం అమ్మవారి ఆలయంతో పాటు నటరాజ స్వామి వారి ఆలయం, మల్లేశ్వర స్వామి వారి ఆలయాల్లో ఆకాశ దీపాలను వెలిగించారు.
సహస్ర లింగార్చన..
ఆలయ ప్రాంగణంలోని శాంతి కల్యాణ వేదిక వద్ద ఆలయ అర్చకులు సహస్ర లింగాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. సహస్ర లింగార్చన సేవలో ఆలయ చైర్మన్ రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా సహస్ర దీపాలంకరణ సేవ జరిగే వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణ మధ్య ఆదిదంపతులకు పూజా కార్యక్రమాలను నిర్వహించి, నేతి దీపాలను వెలిగించారు.


