ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి మంగళవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ గొల్లపూడికి చెందిన పాలడుగు జీవన్ మిత్ర కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందజేసింది. అలాగే విజయవాడ ప్రశాంతినగర్‌కు చెందిన కాలకోట కోమలి కుటుంబం దుర్గమ్మ అన్నదానానికి, గోసంరక్షణ పథకానికి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.


