కూటమి ఎత్తులు చిత్తు | - | Sakshi
Sakshi News home page

కూటమి ఎత్తులు చిత్తు

Nov 10 2026 1:37 AM | Updated on Nov 10 2026 1:37 AM

గన్నవరం జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్‌ సీపీ విజయకేతనం 63 ఓట్లతో అనగాని రవి ఘన విజయం కౌంటింగ్‌ కేంద్రం వద్ద నాటకీయ పరిణామాలు

గన్నవరం: కూటమి ఎత్తులను చిత్తుచేసి గన్నవరం జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్‌ సీపీ విజయ కేతనం ఎగరేసింది. టీడీపీ, బీజేపీ, జనసేన మూడుపార్టీలు ఓటర్లను ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా.. ఎన్నో నాటకీయ పరిణామాలు, హైడ్రామా మధ్య సాగిన కౌంటింగ్‌ ప్రక్రియలో వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి అనగాని రవి 63 ఓట్ల అధిక్యతతో బీజేపీ అభ్యర్థి చిగురుపాటి కుమారస్వామిపై గెలుపొంది సత్తాచాటారు. విజయం వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాగా, కూటమి పార్టీ శ్రేణులను మాత్రం తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సైతం రెండు రోజులు ఎన్నికల ప్రచారం చేసినా, లక్షలాది రూపాయిలు వెచ్చించిన ఓటమి ఎదురవడాన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద హైడ్రామా

ఈ నెల 7వ తేదీ స్థానిక సెయింట్‌జాన్స్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద జెడ్పీటీసీ ఫలితాల వెల్లడిలో హైడ్రామా నడిచింది. మధ్యాహ్నం 2 గంటలకే జెడ్పీటీసీ ఓట్ల కౌంటింగ్‌ ప్రకియ ముగిసి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అనగాని రవి 63 ఓట్లు అధిక్యంలో ఉన్నా ఫలితాలు వెల్లడించకుండా ఎన్నికల అధికారులు తాత్సారం చేశారు. బీజేపీ అభ్యర్థి కుమారస్వామితో పాటు కూటమి నేతలు ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్రలు, కుతంత్రాలకు తెరతీశారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధితో పాటు పలువురు కూటమి పార్టీల ముఖ్య నేతలతో అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారు. చెల్లుబాటు కాని 1,450 ఓట్లను తిరిగి పునఃపరిశీలన చేయాలని కూటమి నేతలు పట్టుబట్టారు. విషయం తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌తో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న కౌంటింగ్‌ సెంటర్‌ సమీపంలోకి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొనడంతో పోలీస్‌ బలగాలను రంగంలోకి దింపారు. సాయంత్రం కౌంటింగ్‌ సెంటర్‌కు చేరుకున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చెల్లుబాటు కాని ఓట్లను పునఃపరిశీలన చేయగా వైఎస్సార్‌ సీపీకి, బీజేపీకి సమానంగా 54 చొప్పున ఓట్లు వచ్చాయి. దీంతో ముందుగా 63 ఓట్లు అధిక్యంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అనగాని రవి విజయం సాధించినట్లుగా రాత్రి 10 గంటల సమయంలో ఎన్నికల అధికారులు ప్రకటించారు.

భారీగా క్రాస్‌ ఓటింగ్‌

మండలంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లుగా ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించిన 16 మంది టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఏకంగా 6,879 ఓట్ల మెజార్టీ సాధించగా, జెడ్పీటీసీ ఫలితాలకు వచ్చేటప్పటికి బీజేపీ అభ్యర్థి కుమారస్వామి 63 ఓట్లతో ఓటమి చెందారు. దీంతో వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి అనగాని రవికి భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జనరల్‌కు కేటాయించిన జెడ్పీటీసీ స్థానంలో బీసీ వర్గానికి చెందిన మాజీ ఎంపీపీ అనగాని రవి అభ్యర్థిగా నిలబెట్టడం, బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఇతర సామాజిక వర్గాలు అండగా నిలవడం, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సమష్టిగా పనిచేయడంతో విజయం వరించిందని విశ్లేషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement