జి.కొండూరు: మైలవరం మండలంలోని పుల్లూరు–1 ఎంపీటీసీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని మళ్లీ రీకౌంటింగ్ పెట్టాలంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్రపునేఠాకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌లో భాగంగా పుల్లూరు–1 ఎంపీటీసీ సెగ్మెంట్‌లో కౌంటింగ్ ప్రక్రియ ఏకపక్షంగా సాగిందన్నారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థి మరీదు వినోద్‌గౌడ్ కౌంటింగ్‌పై అభ్యంతరం తెలిపినా అధికారులు పట్టించుకోలేదన్నారు. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో వైఎస్సార్ సీపీకి పోలైన ఓట్లలో అధికంగా ఇన్‌వ్యాలిడ్ చూపిస్తూ టీడీపీకి పోలైన ఓట్లలో ఇన్‌వ్యాలిడ్ ఓట్లను సైతం కలిపి లెక్కించారన్నారు. దీనిపై రీకౌంటింగ్ చేయాలని ఆర్‌ఓ జ్యోతిలక్ష్మీదేవికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి వినోద్ గౌడ్ ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. రీకౌంటింగ్ చేస్తామని చెప్పిన ఆర్వో జ్యోతిలక్ష్మీదేవి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాటలకు తలొగ్గి టీడీపీ అభ్యర్థి గువ్వల పుల్లారెడ్డి 15 ఓట్ల మెజార్టీతో గెలుపొందారని ప్రకటించారన్నారు. రీకౌంటింగ్ చేయాలని మొరపెట్టుకున్నా వినకుండా పుల్లారెడ్డికి డిక్లరేషన్‌పారాలు సైతం అందజేశారన్నారు. ఈ సెగ్మెంట్‌లో పోలైన ఓట్లను భద్ర పరచి రీకౌంటింగ్ చేయాలని కోరుతూ ఎన్నికల కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందజేసినట్లు నారాయణమూర్తి వివరించారు.


