రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే, విజయవాడ డివిజన్‌లోని రైల్వే ఆడిటోరియంలో గురువారం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ శిబిరం నిర్వహించారు. డీపీఓ విశ్వనాథ్ సోపన్, అసిస్టెంట్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ కె.సునిత, సీనియర్ డీఎంఓ డాక్టర్ ఎస్. దుర్గాప్రసాద్, డీఎంఓ డాక్టర్ కె.వి.ఎన్.జ్యోతి సారథ్యంలో జరిగిన ఈ శిబిరంలో పెన్షనర్‌లు, ఫ్యామిలీ పెన్షనర్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొని డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌లను అప్‌లోడ్ చేసుకున్నారు. డీపీఓ విశ్వనాథ్ సోపన్ మాట్లాడుతూ.. పెన్షనర్‌లు, ఫ్యామిలి పెన్షనర్‌లకు సులబంగా తమ లైఫ్ సర్టిఫికెట్‌లను సమర్పించుకోవడంతో పాటు పెన్షన్ సంబంధిత విషయాలపై అధికారుల నుంచి సలహాలు పొందేందుకు వీలుగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 156 మంది పెన్షనర్‌లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌లను పొదుపరిచినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో రైల్వే ఆస్పత్రి వైద్య విభాగం ఆధ్వర్యంలో పెన్షనర్లకు ఆరోగ్య పరిక్షల సౌకర్యం కల్పించారు. ఇందులో బీపీ, షుగర్, ఈసీజీ వంటి పరిక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ విభాగం, ఎస్‌అండ్‌డబ్ల్యూ విభాలకు చెందిన సిబ్బంది పాల్గొని పెన్షనర్‌లకు సహాయ సహకారాలు అందజేశారు.


